AP Higher Education: అడ్రస్ లేని ఎంటెక్ అడ్మిషన్లు
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:41 AM
రాష్ట్రంలో ఎంటెక్ అడ్మిషన్లు అడ్రస్ లేకుండా పోయాయి. షెడ్యూలు ప్రకారం ఈనెల 6న సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే కాలేజీల నుంచి విద్యార్థులకు సర్టిఫికెట్ల...
షెడ్యూలు ప్రకారం 6న సీట్లు కేటాయించాలి
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంటెక్ అడ్మిషన్లు అడ్రస్ లేకుండా పోయాయి. షెడ్యూలు ప్రకారం ఈనెల 6న సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే కాలేజీల నుంచి విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో ఉత్పన్నమైన సమస్యల కారణంగా ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఈనెల 4న ప్రకటించింది. సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఆ ప్రకటన జారీ చేసి రెండు వారాలు అవుతున్నా.. ఇప్పటి వరకు అది జరగలేదు. దీనిపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు సీట్లు ఎప్పుడు కేటాయిస్తారో అర్థంకాక అయోమయంలో పడ్డారు. మరోవైపు సర్టిఫికెట్ల జారీ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీలు ఫీజులు కట్టలేదంటూ బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల మంజూరును నిలిపివేశాయి. ఆరు క్వార్టర్ల ఫీజుల బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆ మొత్తం చెల్లిస్తేనే.. సర్టిఫికెట్లు ఇస్తామంటూ కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. యూనివర్సిటీ కాలేజీలు కూడా ‘ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు’ అంటూ తెగేసి చెబుతున్నాయి. దీంతో సొంతంగా డబ్బులు కట్టే స్తోమత లేని విద్యార్థులు ఎంటెక్‌లో చేరే అవకాశం కోల్పోతున్నారు. ఈ సమస్యపై ఈ నెల మొదటి వారంలో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. స్పందించిన ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ను వాయిదా వేసి, సవరణ షెడ్యూలు జారీ చేస్తామని ప్రకటించింది.
అప్పులు చేసి.. ఫీజులు కట్టి
మరోవైపు ప్రభుత్వమే ఫీజులను పెండింగ్‌లో పెట్టినందున బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులు యూనివర్సిటీలను ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలను వర్సిటీల అధికారులు లెక్కచేయడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు ఫీజులను తల్లిదండ్రుల ఖాతాల్లో వేసే విధానం ఉంది. 2024-25 నుంచి కూటమి ప్రభుత్వం దాన్ని మార్చి... నేరుగా కాలేజీల ఖాతాల్లోకే ఫీజులు జమ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే నాలుగులో కేవలం ఒక్కటే క్వార్టర్ ఫీజులు విడుదల చేసింది. ప్రభుత్వం తర్వాత ఫీజులను యూనివర్సిటీ కాలేజీల ఖాతాలకే విడుదల చేస్తుంది. అయినా సరే ఆ డబ్బు కూడా విద్యార్థులే కట్టాలని వర్సిటీలు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రభుత్వం చేసిన తప్పునకు విద్యార్థులు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది.