Quota Row Heats Up: రోస్టర్ పాయింట్ల విధానాన్ని సరిచేయాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 06:11 AM
రోస్టర్ పాయింట్ల విధానాన్ని తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేసిన ఎంఆర్‌పీఎస్ నేత కృపాకర్ మాదిగ హెచ్చరించారు. సవరించకపోతే హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు
లేకుంటే హైకోర్టుకు వెళ్తాం: కృపాకర్ మాదిగ
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రెల్లి, మాదిగ, అనుబంధ కులాల విద్యార్థులు, నిరుద్యోగులు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా వచ్చే విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణపై నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసు చేసిన రోస్టర్ పాయింట్ల విధానాన్ని ఆయన తప్పు పట్టారు. అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాల వారికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా కమిషన్ సిఫారసు ఉందన్నారు. రెల్లి అనుబంధ కులాల వారికి 1%, మాదిగ అనుబంధ కులాల వారికి 7%, మాల అనుబంధ కులాల వారికి 7% వచ్చేట్లు వెంటనే సవరించాలని రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని సవరించకపోతే మాదిగలు న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఆర్డినెన్స్ సాధన వెనుక ఎంతోమంది ఎంఆర్‌పీఎస్ కార్యకర్తల ప్రాణత్యాగాలు ఉన్నాయన్నారు.