Manda Krishna Madiga: సీజేఐపై దాడి ఘటనలో కేసు నమోదు ఏదీ
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:26 AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై కోర్టులోనే దాడి జరిగి 12 రోజులు గడుస్తున్నా నేటి వరకు నిందితుడిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఎమ్మార్పీఎస్...
1న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ: మంద కృష్ణమాదిగ
విజయవాడ (గాంధీనగర్), అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై కోర్టులోనే దాడి జరిగి 12 రోజులు గడుస్తున్నా నేటి వరకు నిందితుడిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు.. దీనిని నిరసిస్తూ, హైదరాబాద్‌లో నవంబరు 1న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. త్వరలో ఢిల్లీలోనూ నిరసన చేపడతామని ప్రకటించారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దళితుడైన జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని దళిత జాతిపై జరిగిన దాడిగా భావిస్తున్నాం. ఈ దాడి చేసిన నిందితుడితో పాటు అతడి వెనుక ఉన్న శక్తులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. అత్యున్నత స్థానంలోని దళితుడిపైనే దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? గవాయ్ స్థానంలో అగ్రకులాలకు చెందిన వ్యక్తి ఉంటే పోలీసులు ఇలానే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారా? దళితులు ఎంత ఉన్నతస్థానంలో ఉన్నప్పటికీ వివక్షకు గురి కాక తప్పదా?’ అని పేర్కొన్నారు.