Theft: ఎంపీడీవో భార్య చేతివాటం
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:20 AM
ఆమె ఓ మండల స్థాయి అధికారి (ఎంపీడీవో) భార్య. అయితే ఆ విషయం మరిచి తోటి ప్రయాణికురాలి పర్సు కొట్టేసింది. ఎంపీడీవో ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం...
బస్సులో తోటి ప్రయాణికురాలి పర్సు చోరీ
విషయం తెలిసినా.. దాచిన ఎంపీడీవో
పోలీసుల అదుపులో భార్యాభర్తలు
విజయవాడ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆమె ఓ మండల స్థాయి అధికారి (ఎంపీడీవో) భార్య. అయితే ఆ విషయం మరిచి తోటి ప్రయాణికురాలి పర్సు కొట్టేసింది. ఎంపీడీవో ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. మూడ్రోజుల క్రితం విజయవాడ బస్టాండ్‌లో జరిగిన ఈ దొంగతనానికి సంబంఽధించి పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. పోలీసుల కథనం మేరకు.. పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎంపీడీవో గుంటూరులో నివాసం ఉంటారు. ఆయన కుమార్తె విజయవాడ బెంజి సర్కిల్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గత నెల 29న (బుధవారం) కుటుంబమంతా విజయవాడ వచ్చారు. తిరిగి మధ్యాహ్నం పీఎన్‌బీఎ్‌సలోని గుంటూరు బస్సులు ఆగే ప్లాట్‌ఫాం వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఓ స్టాఫ్ నర్సు కూడా ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్నారు. ఆమె బస్సు ఎక్కుతున్న క్రమంలో ఎంపీడీవో భార్య తోసుకుంటూ కుమార్తెతో కలిసి బస్సు ఎక్కింది. ఈ క్రమంలో నర్సు పర్సును కాజేసిన ఆమె ఆ బస్సు దిగేసింది. టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన భర్తతో మరో బస్సులో వెళ్దామని చెప్పగా.. ఎంపీడీవో వద్దని చెప్పి, అదే బస్సు ఎక్కించారు. గుంటూరులో బస్సు దిగిన నర్సుకు పర్సు కనిపించలేదు. బాధితురాలు 30న కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాట్‌ఫాంపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నర్సు చేతిలో ఉన్న బ్యాగ్‌ను ఎంపీడీవో భార్య అదే పనిగా చూస్తుండడాన్ని గమనించారు. ఎంపీడీవో కుమార్తె యూనిఫాం ఆధారంగా కళాశాలకు వెళ్లి విచారించారు. ఆమె ఫొటో చూపించగానే వారి చిరునామా బయటపడింది. పోలీసులు శుక్రవారం గుంటూరులో ఎంపీడీవో కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, చోరీ బయటపడింది. కాగా, బాధితురాలు తన పర్సులో 14 గ్రాముల బంగారం, రూ.5 వేలు ఉంటే ఫిర్యాదులో మాత్రం 4 కాసుల బంగారు అభరణాలు, రూ.35 వేలు ఉన్నట్టు పేర్కొన్నారు.