Ratnamma passed away: ఎంపీ సీఎం రమేశ్‌కు మాతృవియోగం
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:16 AM
అనకాపల్లి ఎంపీ, రైల్వేబోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేశ్ మాతృమూర్తి చింతకుంట రత్నమ్మ(83) బుధవారం తెల్లవారుజామున...
ప్రజాప్రతినిధులు, ప్రముఖుల నివాళులు
ఎర్రగుంట్ల, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఎంపీ, రైల్వేబోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేశ్ మాతృమూర్తి చింతకుంట రత్నమ్మ(83) బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు స్వర్గస్తులయ్యారు. అనారోగ్యానికి గురైన ఆమె వారం రోజులుగా హైదరాబాదులో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని స్వగ్రామం పోట్లదుర్తికి తీసుకొచ్చారు. బుధవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున పోట్లదుర్తికి వచ్చి రత్నమ్మ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సీఎం రమేశ్‌కు ఫోన్‌చేసి పరామర్శించారు. రమేశ్ తల్లి మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి అనిత ఫోన్‌లో సీఎం రమేశ్‌ను పరామర్శించారు. రత్నమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటలకు పోట్లదుర్తిలో పెన్నానది తీరాన జరగనున్నాయి.