యూరియాపై కదలిక
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:51 AM
జిల్లాలో యూరియా కొరతను అఽధికారులు అధిగమిస్తారా లేక నామమాత్రపు తనిఖీలతో సరిపెడతారా అనే ప్రశ్నలు సర్వత్రా ఉదయిస్తున్నాయి. వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో గతేడాది ఆగస్టులో ఎంత యూరియా వినియోగించారో, ఈ ఏడాది అంతే మొత్తంలో జిల్లాకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. అయితే ఈ యూరియా ఎంతమేర రైతులకు విక్రయించారనే అంశంపై మాత్రం పూర్తిస్థాయి లెక్కలు చెప్పడం లేదు. యూరియా విక్రయాలపై అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- రైతుల సమస్యపై స్పందించిన కలెక్టర్
- గుడివాడ డివిజన్‌లో క్షేత్రస్థాయి పర్యటన
- రైతులు, సొసైటీ అధ్యక్షులతో మాట్లాడి వివరాల సేకరణ
- ఎరువుల సరఫరా కేంద్రాల తనిఖీ
- జిల్లాకు 3 వేల టన్నుల యూరియా దిగుమతి
- విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
- స్పష్టం చేసిన కలెక్టర్ బాలాజీ
ఆంరఽధజ్యోతి-మచిలీపట్నం/గుడివాడ రూర ల్ :
జిల్లాలో యూరియా కొరతను అఽధికారులు అధిగమిస్తారా లేక నామమాత్రపు తనిఖీలతో సరిపెడతారా అనే ప్రశ్నలు సర్వత్రా ఉదయిస్తున్నాయి. వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో గతేడాది ఆగస్టులో ఎంత యూరియా వినియోగించారో, ఈ ఏడాది అంతే మొత్తంలో జిల్లాకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. అయితే ఈ యూరియా ఎంతమేర రైతులకు విక్రయించారనే అంశంపై మాత్రం పూర్తిస్థాయి లెక్కలు చెప్పడం లేదు. యూరియా విక్రయాలపై అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేధిస్తున్న యూరియా కొరత
ఆగస్ట్టు నెలలో కురిసిన వర్షాల కారణంగా నెలరోజులలోపు నాట్లు పూర్తి చేసిన పొలాలు, పిలక తొడిగే దశలో ఉన్న వరిపైరు నీటమునిగింది. పొలంలో నీరు తగ్గిన తర్వాత పైరు త్వరితగతిన కోలుకుని బలం పుంజుకునేందుకు ఎకరానికి 25 కిలోల యూరియాను జల్లాలని వ్యవసాయశాఖ అధికారులు ఇటీవల కాలంలో రైతులకు సూచన చేశారు. దీంతో పాటు ముందస్తుగా వరినాట్లు పూర్తి చేసిన పొలాల్లో రెండు, మూడు కోటాలుగా ఎరువులను రైతులు జల్లుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఎకరానికి 25కిలోల యూరియా కలిపి జల్లుతారు. కీలక సమయంలోనే యూరియా కొరతను కొందరు సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో యూరియా విక్రయాలకు తెరతీశారు. నిబంధనలకు విరుద్ధంగా యూరియా అక్రమ నిల్వలు ఎక్కడ ఉన్నాయో వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు తెలిసినా వారు మిన్నకుండిపోయారు. దీంతో రైతులకు యూరియా అందుబాటులో లేక యూరియా కోసం పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది. మొవ్వ మండలం చిన ముత్తేవి గ్రామంలో యూరియా లారీని వైసీపీ నాయకులు అడ్డుకోవడం, ఈ అంశం వివాదాస్పదం కావడంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై స్పందించారు. దీంతో జిల్లా అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో వరిశీలనకు బయలు దేరారు.
యూరియా కొరత రానివ్వం : కలెక్టర్ బాలాజీ
జిల్లాలో యూరియా కొరతపై కలెక్టర్ బాలాజీ స్పందించారు. గుడివాడ మండలంలోని లింగవరం, వలివర్తిపాడు, రామన్నపూడి పీఏసీఎస్‌లతోపాటు గుడివాడలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాలను ఆయన గురువారం పరిలీలించారు. యూరియా కొరత, విక్రయాలపై రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత మచిలీపట్నం కలెక్టరేట్‌లో, గుడివాడలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం వద్ద మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. యూరియా భవిష్యత్తులో దొరకదనే కారణంతో రైతులు యూరియా కొనుగోలుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రైతులకు కావాల్సిన సమయంలో యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. జిల్లాలో 27 వేల టన్నుల యూరియాను ఇప్పటి వరకు విక్రయించామని తెలిపారు. బయటి జిల్లాల నుంచి రెండు రోజుల్లో 500 టన్నుల యూరియాను తెచ్చుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. యూరియా లభ్యతపై రైతులు కంగారు పడవద్దని ఆయన సూచించారు. జిల్లాకు మూడు, నాలుగు రోజుల్లో మూడు వేల టన్నుల యూరియాను ఎరువుల కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. యూరియాను బ్లాక్‌లో పెట్టి అధిక ధరలకు విక్రయించే వారిపై నిఘా ఉంచామన్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులు 258 ప్రాంతాల్లో తనిఖీలు చేశారని తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 120 టన్నుల యారియాను సీజ్ చేశామన్నారు. ఒకరిపై కేసు నమోదు చేయడంతో పాటు 6-ఏ కేసులు 11 నమోదు చేయడం జరిగిందన్నారు. ఎకరానికి పంట చేతికొచ్చే సమయానికి 100 కిలోల యూరియాను వినియోగించాల్సి ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అవసరాన్ని బట్టి జిల్లాకు యూరియాను తీసుకువస్తామని కలెక్టర్ వివరించారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో యూరియా సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్.పద్మావతి, జిల్లా మేనేజర్ మురళీ కిషోర్, గుడివాడ ఏడీఏ ఎస్.కవిత, తహసీల్దార్ కిరణ్, ఏవో బోలెం అనంతలక్ష్మి, వీఏఏ మౌనిక పాల్గొన్నారు.