Mothers Plea for Hidma: అమ్మ మాట.. అరణ్య రోదన
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:28 AM
లోన్ వర్ర తమ్మా ఇంటికి రా కొడుకా అని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా తల్లి ప్రసార మాధ్యమాల ద్వారా ఇటీవల హిడ్మాను కోరారు...
‘ఇంటికి రా కొడుకా’ అంటూ ఇటీవల హిడ్మాను కోరిన తల్లి
చింతూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘లోన్ వర్ర తమ్మా’ (ఇంటికి రా కొడుకా) అని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా తల్లి ప్రసార మాధ్యమాల ద్వారా ఇటీవల హిడ్మాను కోరారు. ఇది జరిగి వారం గడవక ముందే హిడ్మా ఎన్‌కౌంటర్ అయ్యాడు. వారం కిందట ఛత్తీ్‌సగఢ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయశర్మ హిడ్మా తల్లితో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో ఆమె ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతూ హిడ్మాను ఇంటికి రావాలని, ఇంటి వద్దనే ఏదొక పనిచేసుకొని బతుకుదామని కోరారు. ఏదైనా పరిస్థితిలో హిడ్మా బయటకు రాలేని పరిస్థితి ఉంటే తానే అక్కడకు చేరుకొని వెంట తీసుకొని ఇంటికి వస్తానని కూడా అన్నారు.
ఒంటరైన హిడ్మా తల్లి
సాయుధ పోరాటంలో హిడ్మా కుటుంబం మొత్తం అసువులు బాసింది. హిడ్మా చిన్నప్పుడే తండ్రి మృతి చెందారు. తల్లి, ఇద్దరు అన్నలు, అక్కతో హిడ్మా కుటుంబం పూవర్తి గ్రామంలో జీవనం సాగించేది. పీపుల్స్ వార్ పార్టీ గ్రామాల్లో జననాట్యమండలి వారు సభలు సమావేశాలు నిర్వహించేవారు. ఈ క్రమంలో హిడ్మా సోదరులు పార్టీ వైపు ఆకర్షితులై అందులో చేరారు. 2008లో హిడ్మా అక్క మృతి చెందగా, 2015లో హిడ్మా అన్న ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆయనకు గుర్తుగా పూవర్తిలో హిడ్మా భారీ స్థూపం నిర్మించాడు. ఆ తర్వాత గ్రామంలో క్యాంప్ పెట్టిన భద్రతా బలగాలు ఆ స్థూపాన్ని కూల్చివేశాయి. ప్రస్తుతం హిడ్మా తల్లి ఒక్కరే పూవర్తిలో ఉన్నారు.