Mother Detains Teenage Daughter: అమ్మ చేతిలోనే బందీగా!
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:41 AM
తల్లి కారణంగా రెండేళ్లుగా చీకటి గదిలో బందీ అయిన 16ఏళ్ల బాలికకు స్థానిక న్యాయాధికారి, ఐసీడీఎస్ అధికారుల చొరవతో విముక్తి కలిగింది....
రెండేళ్లుగా కూతురిని చీకటి గదిలో నిర్బంధించిన తల్లి
ఇచ్ఛాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): తల్లి కారణంగా రెండేళ్లుగా చీకటి గదిలో బందీ అయిన 16ఏళ్ల బాలికకు స్థానిక న్యాయాధికారి, ఐసీడీఎస్ అధికారుల చొరవతో విముక్తి కలిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. స్థానిక మహిళకు 2007లో కటక్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. 2009లో పాపకు జన్మనిచ్చింది. కొన్నాళ్లకు ఆయన మృతి చెందటంతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఇచ్ఛాపురంలోనే ఉండిపోయింది. ఆమెకు వచ్చే పింఛను సొమ్ముతో జీవనం సాగిస్తోంది. కూతురిని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. బాలిక 2022లో యుక్తవయసుకు రాగా, బయటికి పంపిస్తే ఏమైపోతోందనన్న భయంతో తల్లి ఆమెను చదువు మాన్పించేసి రెండేళ్లుగా ఇంట్లోనే బంధించినట్లు ఉంచేసింది. స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు ఈ విషయం తెలి యడంతో మంగళవారం ఐసీడీఎస్ పీవో ఎం.రాజేశ్వరికి సమాచారం ఇచ్చారు. ఆమె నుంచి సమాచారం అందుకున్న స్థానిక జూనియర్ సివిల్ న్యాయాధికారి ఫరీ్‌షకుమార్, తహసీల్దార్ వెంకటరావు తదితరులు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లారు. చీకటి గదిలో ఉన్న వీరిద్దర్నీ చూసిన న్యాయాధికారి, ఇతర అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరి పరిస్థితీ బాగోలేకపోవడంతో బాలికను శ్రీకాకుళం స్టేట్ హోమ్‌కు, తల్లిని వైజాగ్ కేజీహెచ్‌కు తరలించారు.