Meteorological Department: ముంచుకొస్తున్న మొంథా హై అలర్ట్
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:24 AM
మొంథా తుఫాన్ ముంచుకొస్తోంది. సోమవారం ఉదయం నుంచి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కోస్తా వైపు పయనిస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి.
నేడు తీవ్ర తుఫాన్‌గా మార్పు.. వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ
తీరం వెంబడి పూర్తి స్థాయి అప్రమత్తత
17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ కోస్తా వైపు
నేటి రాత్రికి కాకినాడ-యానాం మధ్య తీరంపైకి!
ఆ సమయంలో 100 కి.మీ. వేగంతో గాలులు
గుంటూరు-కృష్ణాలపైనా తీవ్ర ప్రభావం ఉండే వీలు
తీరం దాటే వేళ మధ్య కోస్తాలో కుంభవృష్టి
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు
భారీ సంఖ్యలో రైళ్లు, విమాన సర్వీసుల రద్దు
తీరంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ మోహరింపు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
‘మొంథా’ తుఫాన్ ముంచుకొస్తోంది. సోమవారం ఉదయం నుంచి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కోస్తా వైపు పయనిస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తీవ్ర ముప్పును సూచిస్తూ తీరమంతటా వాతావరణశాఖ రెడ్ మెసేజ్‌ను జారీ చేసింది. తీర ప్రాంతాల్లో రోజంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకులను, మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం సాయంత్రానికి తుఫాన్ చెన్నైకి 420 కిలోమీటర్లు తూర్పుగా, కాకినాడకు 450 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 500 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడి, కోస్తాంధ్రకు దగ్గరగా రానుంది. అదేదిశలో పయనించి మంగళవారం రాత్రికి మచిలీపట్నం-విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. అయితే కాకినాడ-యానాం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు.
తుఫాను ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 65 కిమీ వేగంతో వీస్తున్నాయి. తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో మంగళవారం ఉదయం నుంచి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, సాయంత్రం నుంచి గంటకు 90 నుంచి 100- 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం సాయంత్రం తుఫాన్ తీరందాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని, దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని తెలిపారు.
పలు జిల్లాలు తడిసిముద్ద..
తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి 8గంటల వరకు విశాఖ రూరల్‌లో 92.5, కాపులుప్పాడలో 85.5, మధురవాడలో 83.5, సీతమ్మధారలో 81.2 మిల్లీమీటర్ల వాన కురవగా, రాష్ట్రవ్యాప్తంగా 63 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. విశాఖ ఆర్కే బీచ్‌లో నీరు బాగా ముందుకువచ్చింది. అనకాపల్లి జిల్లాలో సాయంత్రం నుంచి వర్షం మరింత ఎక్కువైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం స్వల్పగాలులతో చిరుజల్లులు కురిశాయి. ఒడిశాలో వర్షాలు కురస్తుండడంతో ఈ జిల్లాలో జలాశయాలకు వరద పోటెత్తింది. మరోవైపు రైతులు వరి, మొక్కజొన్న, పత్తి పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం నుంచి ఈదురుగాలుల కూడా మొదలయ్యాయి. పోలాకి మండలంలో అత్యధికంగా 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు మొదలయ్యాయి. విజయనగరంలో కడలి కల్లోలంగా మారింది. భోగాపురం మండలం ముక్కాం వద్ద సముద్రం 15 మీటర్లు ముందుకొచ్చింది. భయపడిన మత్స్యకారులు తీరంలో లంగరు వేసిన బోట్లను గృహాల వద్దకు చేర్చారు.
దక్షిణ కోస్తాలో..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం తీవ్రత పెరిగింది. సూర్యలంక సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో పర్యాటకులపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. కుండపోత వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పల్నాడు జిల్లాలో సోమవారం కారు మబ్బులు కమ్ముకొని జల్లులు ప్రారంభమయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నర్సాపురం తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాయంత్రానికి సగటున 6సెంమీ వర్షం కురిసింది. మొగల్తూరులో పర్యాటక రిసార్ట్‌లు, బీచ్ సందర్శనలను నిషేధించారు. ప్రకాశం జిల్లాలో తుఫాన్ ప్రభావం తీవ్రంగానే ఉండనుందని వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించాయి. కార్తీక సముద్ర స్నానాలకు పెద్దసంఖ్యలో వచ్చేవారిని దృష్టిలో ఉంచుకుని కొత్తపట్నం, పాకల, ఈతముక్కల, కనపర్తి ఇతర బీచ్‌లు, తీరాలను మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలో ఉదయం తేలికపాటి వర్షం ప్రారంభమై, మధ్యాహ్నం తర్వాత అధికమైంది. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. గుంతకల్లులోని పలు కాలనీల్లో వర్షపు నీరు మోకాళ్లలోతు నిలిచింది. నెల్లూరు జిల్లాలో రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయి.
భయపెడుతున్న భారీ వర్షసూచన..
సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు; కోస్తాలోని మిగిలిన జిల్లాలు; రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర తుఫాన్ 233 మండలాల్లోని 1,419గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ అంచనా వేశారు. ఆయా ప్రాంతాల్లో 2,194 పునరావాస శిబిరాలు సిద్ధంగా ఉండగా, అవసరమైన ప్రాంతాల వారిని అక్కడి తరలించడానికి జిల్లాల యంత్రాంగం చర్యలు చేపట్టింది.
రెడ్ అలర్ట్
తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకూ భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మంగళ, బుధవారాలు పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రాంతాలు ప్రధానంగా కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో సముద్ర అలలు మీటరు ఎత్తు మేర ఎగిసిపడనున్నాయి. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని ఐఎండీ హెచ్చరించింది.
ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్‌ల మోహరింపు
తుఫాన్ సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్‌లు జిల్లాల్లో మోహరించాయి. నెల్లూరు, మచిలీపట్నం, భీమవరం, పిఠాపురం, తాళ్లరేవు, అమలాపురం, శ్రీకాకుళంలలో 30 మంది సభ్యులతోను, అనకాపల్లిలో 35 మందితో ఒక్కో ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్ సిద్ధంగా ఉండగా, విశాఖలో 60 మందితో రెండు బృందాలు, కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ బెటాలియన్‌లో 90 మందితో మూడు బృందాలు రిజర్వ్‌లో ఉన్నాయి. విజయవాడ ఘాట్స్, తిరుపతిలోని బీఎన్ కండ్రిక, ఒంగోలు, అమలాపురం, ఏలూరు, అనకాపల్లిలలో 25 మంది చొప్పున ఒక్కో ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్, రాజమండ్రి, బాపట్ల-సూర్యలంక, రాజంపేటలో 30 మంది చొప్పున ఒక్కో టీమ్, విశాఖ, కాకినాడ, తిరుపతిలో 30 మంది చొప్పున ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్‌లు రిజర్వ్‌లో ఉన్నాయి.