Share News

Montha Cyclone: ముంచేసింది

ABN , Publish Date - Oct 30 , 2025 | 05:53 AM

మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన మొంథా తుఫాన్‌ నర్సాపురం వద్ద తీరాన్ని వదిలింది. వెళుతూ, వెళుతూ, అన్నదాతలను నిండా కన్నీట ముంచేసింది.

 Montha Cyclone: ముంచేసింది

  • నర్సాపురం వద్ద తీరం దాటుతూ తీర జిల్లాలపై మొంథా తుఫాన్‌ బీభత్సం

  • కుండపోత..పెను గాలులతో కుదేలైన అన్నదాత ఆశలు

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన మొంథా తుఫాన్‌ నర్సాపురం వద్ద తీరాన్ని వదిలింది. వెళుతూ, వెళుతూ, అన్నదాతలను నిండా కన్నీట ముంచేసింది. ఎటు చూసినా పంట పొలాలు సముద్రాలను తలపిస్తున్నాయి. కంకులు వచ్చి ధాన్యంగా రూపొందించేదశలో ఉన్న వరి పంట పొలంలోనే వాలిపోయింది. పత్తికాయలు విచ్చుకొని అందులోని విత్తనాల నుంచి మొక్కలు వచ్చాయి. కళ్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న చేతికి అందకుండా పోయింది. ఎడతెరిపి లేని కుండపోత వానలకుతోడు తుఫాన్‌ తీరం దాటేవేళ విరుచుకుపడ్డ పెనుగాలుల బీభత్సం రైతులకు అపార కష్టం మిగిల్చింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని లంకలు, గ్రామాలు, సమీప పట్టణాలు జల దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి. రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు, గడ్డలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ రోడ్లు, కల్వర్టులపైకి పారుతూ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. రహదారులు నదులను తలపిస్తుండటంతో ప్రజా రవాణా చాలా చోట్ల కొన్నిగంటలపాటు స్తంభించిపోయింది. సకాలంలో సహాయక చర్యలు అందుబాటులోకి రావడం, రెస్క్యూ టీమ్‌లు ఎక్కడికక్కడ చురుగ్గా కదలడం ఆస్తి, ప్రాణ నష్టాలను చాలావరకు తగ్గించేసింది. గత మూడురోజులుగా రాష్ట్ర ప్రజలకు గొప్ప ఊరటను అందించింది. తుఫాన్‌ 1.23 లక్షల హెక్టార్ల పంట నష్టం మిగిల్చినట్టు ప్రాఽథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది.


అపార కష్టం..

సముద్ర తీరం పరిధిలోని జిల్లాలపై మొంథా విరుచుకుపడి, రైతుల పంట కలను ఘోరంగా దెబ్బతీసింది. పశ్చిమగోదావరి జిల్లా: వర్షాల కంటే పెనుగాలితోనే పంటలకు అపారనష్టం వాటిల్లింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గాలులు, వర్షం తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేశారు. పెద్ద ప్రభావం లేకుండానే తుఫాను వీడిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ వేకువజామున మూడు గంటలకు ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సుడిగాలులు వీచాయి. రెండు గంటల పాటు వీచిన గాలులతో రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. ఈ జిల్లా వ్యాప్తంగా 26,381 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. చాలా మండలాల్లో వరి పంట వెన్నుదశలో పంట ఉంది. మరో 15 రోజుల్లో మసూళ్లు ముమ్మరం కానున్నాయి. ఈ తరుణంలో మొంథా తుఫాను విరుచుకుపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

బాపట్ల జిల్లా: వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి ఈ జిల్లాలో 53,970 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా తేల్చింది. ఇందులో ఉద్యాన పంటలు 4,450 ఎకరాలుగా యంత్రాంగం గుర్తించింది. 31,000 మంది రైతులపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపింది. అత్యధికంగా వరి 38,700, మినుము 4,200 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. పత్తి, బార్లీ పొగాకుతో పాటు ఉద్యానపంటలైన అరటి, బొప్పాయి, కూరగాయల పంటల విస్తీర్ణం కూగా గణనీయంగానే ఉంది. తుఫాన్‌ ప్రభావంతో సముద్రపు నీరు ఉప్పొంగడంతో తీరానికి సమీపంలో ఉన్న రేపల్లె మండలం లంకెవానిదిబ్బ పరిధిలో దాదాపు 300 ఎకరాల వరి పైరు తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 200 ఎకరాల రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి.


గుంటూరు జిల్లా: 17 మండలాల్లో 22,615 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. అలానే 17,348 హెక్టార్లలో పత్తి, 1508 హెక్టార్లలో మినుము దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

విశాఖ : 21 గ్రామాల్లో 107.7 హెక్టార్లలో పంట దెబ్బతింది.

విజయనగరం : 1633 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి పంట నేలవాలింది. కూరగాయల పంటలు నీట మునిగాయి.

ఏలూరు: 26 మండలాల్లో 281 గ్రామాల్లో 9,567 రైతులకు చెందిన 7920.64 హెక్టార్లలో వరి, మినుము, వేరుశనగ, పత్తి పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది.

నంద్యాల: చేతికొచ్చిన పంటలు నీటమునగడంతో నంద్యాలలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కళ్లాలో ఆరబెట్టిన మొక్కజొన్న మొలకలెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన వరిపంట వర్షపు నీరు ముంచెత్తడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2,792 మంది రైతులకు చెందిన 1,960 హెక్టార్లలో వరి, కంది, మినుము, మొక్కజొన్న, పొగాకు పంటలకు నష్టం వాటిల్లింది.

పల్నాడు: 55,935 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు తేల్చారు.

నెల్లూరు జిల్లా: కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 1320.73 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో 1282.63 హెక్టార్లలో వరి పంట దెబ్బతినగా, 21.7 హెక్టార్లలో మొక్కజొన్న, 11.4 హెక్టార్లలో వేరుశనగ పంట దెబ్బతింది.

శ్రీకాకుళం: 4,801 రైతులకు చెందిన 2,230.29 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది.

పార్వతీపురం మన్యం జిల్లా: 904 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 50 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.

అనకాపల్లి జిల్లా: 1,277 హెక్టార్లలో వరి పైరు నీట మునిగింది.


భయపెడుతున్న వరద ఉధృతి

బాపట్ల జిల్లా : పర్చూరు నియోజకవర్గం మొత్తం దాదాపుగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. పర్చూరు వాగు, ఉప్పుటూరు వాగు, ఇంకొల్లు పరిధిలోని కప్పలవాగు పొంగడంతో 35 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పర్చూరు వాగు ఉధృతికి చీరాల--చిలకలూరిపేట జాతీయ రహదారిపై వరదనీరు పొటెత్తడం, ప్రవాహ దారి లేకపోవడంతో ఆ నీరంతా పొలాలను కబళించింది.

విజయనగరం జిల్లా: వరుస వర్షాలతో చంపావతి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జిల్లాలోని అండ్ర, తాటిపూడి, మడ్డువలస ప్రాజెక్టుల్లోకి వరద నీరు అధికంగా రావడంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడిచి పెడుతున్నారు.

ఏలూరు జిల్లా: పెద ఎడ్లగాడి వద్ద కొల్లేరు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో కైకలూరు మండలం గోకర్ణపురం నుంచి పైడిచింతపాడు వెళ్లే రహదారి మునిగిపోయింది. కొయ్యలగూడెం మండలం రాంజీపురంలో తాటాకుఇల్లు కూలింది. అలుగులగూడెం- దెందులూరు- సత్యనారాయణపురం గ్రామాల మధ్యలో గుండేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

నంద్యాల: నల్లమలలో కురిసిన భారీ వర్షంతో పాలేరు పొంగి ప్రవహించడంతో నంద్యాల జిల్లాలో మహానంది మండలం, నంద్యాల పట్టణాన్ని వరద ముంచెత్తింది. పాలేరు వాగు నంద్యాల పట్టణంలోని చామకాల్వలో కలిసి కుందూనదిలో కలుస్తుంది. భారీ వర్షాలకు చామకాల్వ పొంగి, ఇరువైపులా ఉన్న లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్త పూర్తిగా స్తంభించింది. నంద్యాల మండలంలో 19 గ్రామాల్లో వరద ప్రవహించింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా: మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ ఈదురుగాలులతో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో గెడ్డలు,వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అరకులోయ, పాడేరు ఘాట్‌ మార్గాల్లో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి.

అనకాపల్లి: మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.


1.23లక్షల హెక్టార్లలో పంట నష్టం

నేటి నుంచి ఎన్యూమరేషన్‌

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 1.23 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆయా శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. వివిధ రకాల వ్యవసాయ పంట లు లక్షా13వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అత్యధికంగా కోనసీమ జిల్లాల్లో 24,782 హెక్టార్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో 13,479 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,38లక్షల మంది రైతులకు నష్టం జరగ్గా, కోనసీమ జిల్లాలో దాదాపు 39వేల మంది నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వరి 71,750, పత్తి 30,133, మినుము 6,073 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. పల్నా డులో అత్యధికంగా 9,500 హెక్టార్లు, ఎన్టీఆర్‌ జిల్లా లో 8,500హెక్టార్లలో పత్తి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. పొలాల్లో వర్షపు నీరు 4 రోజుల్లో తగ్గుతుందని, నీరు పోయాక పంట నష్టం పూర్తి స్థాయిలో తెలుస్తుందని అధికారులు తెలిపారు. తుఫాన్‌ నేపథ్యంలో పంట నష్టంపై గురువారం నుంచి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌ నిర్వహిస్తామని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ బుధవారం రాత్రి తెలిపారు.


బీభత్సం..

తుఫాన్‌ తీరం దాటేవేళ విరుచుకుపడిన భారీ వర్షాలు, పెను గాలులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

విశాఖ: వరుస వర్షాలతో 22 ఇళ్లు దెబ్బతినగా, 157 ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. తుఫాన్‌ ప్రభావానికి తీవ్రంగా గురైన ఏలూరు జల్లాలో విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో చాలా ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

గుంటూరు జిల్లా: 50 కిలోమీటర్ల రోడ్లు తిన్నాయి.

శ్రీకాకుళం జిల్లా: విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు పలుచోట్ల భారీగా నేలకూలాయి. రూ. 11.73 లక్షలు ఆస్తినష్టం సంభవించింది. ఆర్‌అండ్‌బీకి చెందిన 16.38 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల 44 ఇళ్లు కూలిపోయాయి.

పశ్చిమ గోదావరి: తుఫాను గాలులకు 175 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 662 చెట్లు కూకటి వేళ్లతో నేల మట్టం అయ్యాయి.

అనకాపల్లి జిల్లా: 84 పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. 83 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 31 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. చెట్ల కొమ్మలు పడడంతో 3 కిలోమీటర్ల మేర విద్యుత్‌ తీగలు తెగాయి.


తిరుమల ఘాట్‌లో కూలిన భారీ వృక్షం

తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్‌రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి రెండు భారీ వృక్షాలు కూలాయి. ఏనుగుల ఆర్చ్‌, 14వ మలుపు రోడ్డుకు అడ్డుగా విరిగి పడ్డాయి. విజిలెన్స్‌, ఫారెస్ట్‌ సిబ్బంది సకాలంలో స్పందించి వృక్షాలను తొలగించి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Oct 30 , 2025 | 06:24 AM