Prakasam District: ప్రకాశంపై మొంథా పంజా
ABN , Publish Date - Oct 30 , 2025 | 06:12 AM
ప్రకాశం జిల్లాపై ‘మొంథా’ పంజా విసిరింది. తుఫాను ధాటికి కురిసిన కుం డపోత వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.
లక్ష ఎకరాల్లో పంట నష్టం
గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల వరద
ఒంగోలు నగరంలో నీట మునిగిన 20 కాలనీలు
ఒంగోలు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాపై ‘మొంథా’ పంజా విసిరింది. తుఫాను ధాటికి కురిసిన కుం డపోత వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జిల్లాలో గత 24 గంటల వ్యవధి లో 16.33 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఒంగోలులో 25.72 సెం.మీ. వాన కురిసింది. కొండపి, చీమకుర్తి, కొత్తపట్నం, ఎన్‌జీపాడు, కురిచేడు, సింగరాయకొండ, మద్దిపాడు మండలాల్లో 20 సెం.మీ.పైగా వర్షపా తం నమోదైంది. జిల్లాలోని 39 మండలాల్లో ఒక్క దోర్నాల మినహా మిగిలిన అన్నింటిలోనూ 10 సెం.మీ.పైగా వర్షం కురిసింది. యేరులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించా యి. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా 70వేల క్యూసెక్కుల వరద రాగా అన్ని గేట్లు ఎత్తి మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. చారిత్రక కంభం చెరువు ఐదేళ్ల తర్వాత పూర్తిగా నిండింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోయి గత రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచి అంధకారం నెలకొంది. వందలాది గ్రామాల్లో పంటలు నీటిపాలయ్యాయి. దాదాపు లక్ష ఎకరాల్లో పత్తి, పొగాకు, కంది, సజ్జ, వరి, మొక్కజొన్న వంటి పంటలు నీటిలో ఉన్నాయి. రూ.250 కోట్ల మేర రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఒంగో లు నగరంలోనే దాదాపు 20 కాలనీలు మునిగిపోగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వందకుపైగా కాలనీలు జలమయమయ్యాయి. జలమయమైన ప్రాంతాల్లో 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4,791 మందిని తరలించారు.
గుండ్లకమ్మ గేట్లు ఎత్తడంతో ఆందోళన
గుండ్లకమ్మకు 70వేల క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న దాదాపు 25 గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. 15 గ్రామాల్లో బుధవారం రాత్రి 10:30 గంటలకే వరద నీరు చేరడంతో గ్రామస్థుల్లో భయాందోళన మొదలైంది. మద్దిపాడు మండలంలోని దొడ్డవరం, మల్లవరం, వెలంపల్లి, నందిపాడు, కీర్తిపాడు, రాచవారిపాలెం తదితర గ్రామాలతోపాటు నాగులుప్పలపాడు మండలంలోని ఇనమనమెళ్లూరు, మద్దిరాలపాడు, చీర్వానుప్పలపాడు తదితర గ్రామాలకు వరద నీరు చేరింది.