Meteorology Department: వానలోటు తీర్చిన మొంథా తుఫాను
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:48 AM
మొంథా తుఫాన్ ఫలితంగా రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా పెరిగింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు -7.5శాతం వర్షం లోటు ఉండగా, అక్టోబరులో తుఫాను ప్రభావంతో...
గణనీయంగా పుంజుకున్న వర్షపాతం
అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ఫలితంగా రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా పెరిగింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు -7.5శాతం వర్షం లోటు ఉండగా, అక్టోబరులో తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసి, వర్షపాతం +10.96శాతానికి చేరింది. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 14.3 సెంటీమీటర్లు కాగా, కేవలం 8.9సెంటీమీటర్ల వర్షమే కురిసింది. అలాగే అక్టోబరులో 16 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి 13.6 సెంటీమీటర్ల నమోదైంది. అయితే శ్రీకాకుళం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో సాధారణం కన్నా అత్యధికంగా వర్షాలు కురవగా, విజయనగరం, మన్యం, కాకినాడ, కోనసీమ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షపాతానికి స్వల్పతేడాతో వానలు పడ్డాయి. ఈ జిల్లాల్లో సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో చాలా వ్యత్యాసం వచ్చింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో సాధారణ కన్నా చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే కోస్తాంధ్రలో 18.1 సెంటీమీటర్లకు 15.8 సెంటీమీటర్లు, రాయలసీమలో 13.6 సెంటీమీటర్లకు 8.6 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అయితే గతనెల చివరి వారంలో తుఫానుకారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఇక, జూన్ 1 నుంచి ఇప్పటి(నవంబరు2) వరకు 75.7 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి 84 సెంటీమీటర్ల వాన పడింది. సగటున అల్లూరి, మన్యం జిల్లాల్లో 63 రోజులు వానలు కురవగా, నెల్లూరు జిల్లాలో 20రోజులే వర్షం పడింది. నైరుతీ రుతుపవన కాలంలో వర్షపాతం తక్కువగానే ఉండగా, గత నెల మూడో వారంలో వచ్చిన ఈశాన్య రుతుపవనాలు, మొంథా తుఫాను ప్రభావంతో వరుసగా భారీ వర్షాలు కురవడంతో వాన లోటు తీరింది. అయితే ఖరీఫ్ సీజన్‌లో అతి తక్కువ వర్షాలు కురిసిన ప్రకాశం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లోని 37 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.