Share News

Monsoon Storms: దేశమంతా విస్తరించిన రుతుపవనాలు

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:03 AM

పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండురోజుల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్‌ దిశగా పయనించనుంది.

Monsoon Storms: దేశమంతా విస్తరించిన రుతుపవనాలు

  • హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలకు 17 మంది మృతి

  • ఉత్తరాఖండ్‌కు రెడ్‌ అలర్ట్‌..

  • చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

  • జార్ఖండ్‌లో 162 మంది విద్యార్థులను కాపాడిన పోలీసులు

  • బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండురోజుల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్‌ దిశగా పయనించనుంది. గుజరాత్‌లోని కచ్‌ పరిసరాల్లో ఏర్పడిన మరో అల్పపీడనం బలహీనపడిప్పటికీ.. రాజస్థాన్‌లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఈ ప్రభావంతో రుతు పవనాలు చురుగ్గా మారి ఆదివారం పశ్చిమ రాజస్థాన్‌, పశ్చిమ యూపీ, హరియాణా, ఢిల్లీలోకి ప్రవేశించాయి. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్టయింది. నైరుతి సీజన్‌లో జూన్‌ 29 వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, విదర్భ, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్‌, అసోం, మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్‌, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్రల్లో జూన్‌లోనే వరదలు సంభవించాయి. కొన్ని రాష్ట్రాల్లో కుంభవృష్టి, మరికొన్ని రాష్ట్రాల్లో వర్షాభావం కొనసాగుతుండటంపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


హిమాచల్‌లో ఆకస్మిక వరదలు

హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది. రూ.300 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, విద్యుత్‌, తాగునీటి సరఫరా స్తంభించిపోయాయని రెవెన్యూ, గిరిజనాభివృద్ధిశాఖల మంత్రి జగత్‌ సింగ్‌ నేగీ చెప్పారు. కొండప్రాంతాలకు వచ్చే పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం చార్‌ధామ్‌ యాత్రను 24 గంటలపాటు నిలిపివేసింది.

వాతావరణం మెరుగయ్యే వరకు పర్యాటకులు కొండ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించింది. రిషికేశ్‌కు చేరుకున్న యాత్రికులు అక్కడే ఆగిపోవాలని, అక్కడి నుంచి ముందుకు కదిలిన యాత్రికులు నిర్దేశిత సురక్షిత ప్రదేశాల్లో ఆగాలని గఢ్‌వాల్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌ పాండే సూచించారు. ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్‌ జిల్లాలో భారీ వర్షాలకు ఒక ప్రైవేటు రెసిడెన్షియల్‌ పాఠశాల భవనం నీటమునగడంతో శనివారం రాత్రి నుంచి సుమారు 162 మంది విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వారిని ఉపాధ్యాయులు పాఠశాల పైకప్పు మీదికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో బోట్లలో వచ్చి తాళ్ల సాయంతో గ్రామస్థులతో కలిసి వారిని కాపాడారు.

Updated Date - Jun 30 , 2025 | 09:35 AM