Share News

Montha Cyclone: తూర్పున కకావికలం

ABN , Publish Date - Oct 30 , 2025 | 06:04 AM

మొంథా తుఫాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను కకావికలం చేసింది. అనుకున్నంత తీవ్రత లేనప్పటికీ ఈదురుగాలులు, భారీ వర్షాలకు లక్ష ఎకరాలకు పైగా పంటలకు తీవ్రం నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరిచేలు నీటమునిగాయి.

Montha Cyclone: తూర్పున కకావికలం

  • భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఉమ్మడి జిల్లాలో భారీ నష్టం

అమలాపురం/కాకినాడ/రాజమహేంద్రవరం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను కకావికలం చేసింది. అనుకున్నంత తీవ్రత లేనప్పటికీ ఈదురుగాలులు, భారీ వర్షాలకు లక్ష ఎకరాలకు పైగా పంటలకు తీవ్రం నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరిచేలు నీటమునిగాయి. చెట్లు, వృక్షాలు విరిగిపోయాయి. వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కోనసీమ జిల్లాలో 20 వేల ఎకరాల వరకు వరిపంటకు, 1590 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 300కు పైగా విద్యుత్‌ స్తంభాలు నేలరాలాయి. వాటిని పునరుద్ధరించే పనిలో సిబ్బంది ఉన్నారు. సఖినేటిపల్లి, మలికిపురం మండలాల పరిధిలో తీవ్రమైన గాలులకు చెట్లు, వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఎక్కడా ప్రాణాపాయం లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. తుఫానుతో కాకినాడ జిల్లా కూడా నష్టపోయింది. కాకినాడ వద్ద తీరం దాటుతుందని భావించినా.. కోనసీమవైపు దారి మళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లాలో 116 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈదురుగాలులకు 17,172 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. పిఠాపురం నియోజకవర్గంలో 400 ఎకరాల్లో అరటి, 190 ఎకరాల్లో మొక్కజొన్న, 1500 ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. జగ్గంపేటలో మొక్కజొన్న, కూరగాయలు, మినుము పంటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఏలేరు, సుద్ధగడ్డకు భారీగా వరదనీరు చేరింది. 4,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉప్పాడ బీచ్‌రోడ్డులో కొత్తపట్నం, సుబ్బంపేట వద్ద పడిన గండ్లను బండరాళ్లతో అధికారులు పూడ్చివేయించారు.


తుఫాను తీరాన్ని తాకే సమయంలో వీచిన గాలులకు చెట్లు నేలకొరిగాయి. వాటి కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడడంతో తెగిపోయాయి. కొన్నిచోట్ల స్తంభాలు విరిగిపోయాయి. కాకినాడ జిల్లాలో 181 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి. 33 కేవీ ఫీడర్లు 52, 11 కేవీ ఫీడర్లు 214 వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు మరమ్మతులు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. రూ.కోటి 12లక్షల మేర నష్టం వాటిల్లింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 53 గృహాలు, 8 రహదారులు దెబ్బతిన్నాయి. 49 చెట్లు కూలిపోయాయి. తుఫాను ప్రభావం వల్ల విభజిత తూర్పుగోదావరి జిల్లాకు భారీనష్టం జరిగింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండడంతో ప్రాణనష్టం జరగలేదు. మంత్రి కందుల దుర్గేశ్‌, కలెక్టర్‌ కీర్తి చేకూరి, ప్రత్యేకాధికారి కన్నబాబు, ఎమ్మెల్యేలు, అధికారులు తుఫాను తదుపరి పునరుద్ధరణ పనులు పూర్తిచేయించడంలో అహర్నిశలు పనిచేశారు. జిల్లాలో 244 విద్యుత్‌ స్తంభాలు నేలకూలగా, 26 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.


‘కృష్ణా’లో 50 వేల హెక్టార్ల పంట మునక

(విజయవాడ/మచిలీపట్నం-ఆంధ్రజ్యోతి)

మొంథా తుపాన్‌ ప్రభావంతో కృష్ణా జిల్లాలో వరి, ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో 1.56 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా.. 1.20 లక్షల హెక్టార్లలో పంట చేలల్లోనే వాలిపోయింది. ప్రాథమిక అంచనా మేరకు దాదాపు 50 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు తెలుస్తోంది. బంటుమిల్లి, బాపులపాడు, గన్నవరం, ఘంటసాల, ఉయ్యూరు, కంకిపాడు, కోడూరు, మచిలీపట్నం మండలాల పరిధిలో ఒక్కో మండలంలో 5 వేల నుంచి 7 వేల హెక్టార్ల చొప్పున పంట నష్టం జరిగింది. అలాగే 226.50 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో ఒక్క అరటి పంటే 200 హెక్టార్ల వరకూ ఉంది. భారీ గాలులతో బాపులపాడు మండలంలో 15 హెక్టార్లలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. కాగా, ఎన్టీఆర్‌ జిల్లాలోని 20 మండలాల పరిధిలో డ్రోన్‌ బృందాలు, వ్యవసాయ అధికారుల బృందాలు పంట నష్టాన్ని అంచనా వేశాయి. ప్రాథమిక అంచనాల మేరకు 14,055 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. అయితే రైతులు చెబుతున్న దాని ప్రకారం 80వేల ఎకరాలకు పైగా వ రి పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 26వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. మొంథా తుపానుకు ముందే కురిసిన వర్షాలతో పత్తి పంట దెబ్బతింది. పత్తికాయలు విచ్చుకోగా అందులోని విత్తనాల నుంచి మొలకలు వచ్చాయి. ఇక మొక్కజొన్న 1,800 ఎకరాల్లోనూ, కంది, పెసలు, మినుములు, వేరుశెనగ, చెరకు పంటలకు సంబంధించి 1,520 ఎకరాల్లోనూ పంట నష్టం జరిగిందని అంచనా.

Updated Date - Oct 30 , 2025 | 06:06 AM