Share News

Weather Forecast: రుతుపవన విరామం

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:23 AM

దేశంలో రుతుపవనాల విరామం (బ్రేక్‌ మాన్‌సూన్‌) వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుతుపవన ద్రోణి తూర్పుభాగం ఉత్తరాది వైపునకు మళ్లనుంది. దీంతో బిహార్‌, పశ్చిమబెంగాల్‌, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పెరగనున్నాయి.

Weather Forecast: రుతుపవన విరామం

  • దక్షిణాదిలో కొనసాగనున్న వర్షాభావం

  • ఖరీఫ్‌ పంటలపై తీవ్ర ప్రభావం

  • పెరగనున్న ఎండ తీవ్రత: స్కైమెట్‌

విశాఖపట్నం, జూలై 30(ఆంధ్రజ్యోతి): దేశంలో రుతుపవనాల విరామం (బ్రేక్‌ మాన్‌సూన్‌) వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుతుపవన ద్రోణి తూర్పుభాగం ఉత్తరాది వైపునకు మళ్లనుంది. దీంతో బిహార్‌, పశ్చిమబెంగాల్‌, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పెరగనున్నాయి. ఇంకా తమిళనాడు, కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు తప్ప దక్షిణాదిలో వర్షాభావం కొనసాగనుంది. ఎండ తీవ్రత పెరిగి పొడి వాతావరణం నెలకొంటుందని, ప్రధానంగా పశ్చిమ తీరంలో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పడతాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ పేర్కొంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ పరిసరాల్లో అల్పపీడనం బలహీనపడింది. రానున్న రెండు రోజుల్లో రుతుపవనద్రోణి తూర్పుభాగం ఉత్తరాది వైపునకు వెళ్లనుందని స్కైమెట్‌ తెలిపింది. చైనా, వియత్నాం, ఇతర తూర్పు ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వైపా తుఫాన్‌ అవశేషం గతవారం బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారి బలపడి వాయుగుండమై తూర్పుభారతం మీదుగా మధ్య భారతం చివరి వరకు పయనించింది. దీనివల్ల దక్షిణాదిలో వర్షాలు తగ్గి, వేసవి తరహా ఎండలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించిన తర్వాత ఏర్పడిన రుతుపవనద్రోణి చాలా రోజులు మధ్యభారతం, ఇంకా పైభాగంలోనే కొనసాగింది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు వచ్చినప్పుడు మాత్రం వాయవ్య బంగాళాఖాతం మీదుగా పయనించి మళ్లీ ఉత్తరాది వైపే కొనసాగింది. రుతుపవనద్రోణి తూర్పుభాగం దక్షిణం వైపు పయనిస్తేనే ఏపీ, తెలంగాణ, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ పరిస్థితి ఈ నైరుతి సీజన్‌లో లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం కొనసాగుతుంది.


వచ్చే 5 రోజులు చెదురుమదురు వర్షాలు..

ఈ ఏడాది రుతుపవనాలు విస్తరించే సమయం, తర్వాత ఈ నెల మూడో వారంలో కొద్దిరోజులు తప్ప మిగిలిన రోజుల్లో వర్షాలు లేవు. ఎక్కువ రోజులు ఎండలు కాయడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. రుతుపవనద్రోణి తూర్పుభాగం దక్షిణాది వైపు వచ్చిన తర్వాతే మళ్లీ వర్షాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, రుతుపవన విరామం సమయంలో దక్షిణాదిలో ఎండ ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది.

Updated Date - Jul 31 , 2025 | 04:25 AM