‘ధన’ కార్యాలు!
ABN , Publish Date - May 15 , 2025 | 12:40 AM
జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్)లో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెస్ట్ బైపాస్‌లో అలైన్‌మెంట్ పేరుతో సదరు ఉద్యోగి ‘ధన’కార్యాలు వెలగబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధీకృతం కానీ అలైన్‌మెంట్ కాపీలతో పొలాల్లోకి వెళ్లి హల్‌చల్ చేసి.. టవర్ల మార్పు, చేర్పుల పేరుతో రైతుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. ఇతని అవినీతి పనులతో అలైన్‌మెంట్ వివాదాలమయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పులను కలిగిస్తోంది.
- వెస్ట్ బైపాస్‌లో అలైన్‌మెంట్ పేరుతో ఓ కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకం
- అధీకృతం కానీ అలైన్‌మెంట్ కాపీలతో పొలాల్లో హల్‌చల్
- టవర్ల మార్పు పేరుతో రైతుల నుంచి భారీగా వసూళ్లు!
- కార్లలో జల్సా.. పెట్రోల్ బంకు ఏర్పాటుకు స్థలాన్వేషణ
- సదరు ఉద్యోగి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు
జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్)లో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెస్ట్ బైపాస్‌లో అలైన్‌మెంట్ పేరుతో సదరు ఉద్యోగి ‘ధన’కార్యాలు వెలగబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధీకృతం కానీ అలైన్‌మెంట్ కాపీలతో పొలాల్లోకి వెళ్లి హల్‌చల్ చేసి.. టవర్ల మార్పు, చేర్పుల పేరుతో రైతుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. ఇతని అవినీతి పనులతో అలైన్‌మెంట్ వివాదాలమయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పులను కలిగిస్తోంది.
(ఆంద్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ వెస్ట్ బైపాస్ పేరుతో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్)లో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి చేపట్టిన ‘ధన’ కార్యాలు తాజాగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సదరు ఉద్యోగి చేసిన పనుల వల్ల బైపాస్‌లో అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయి. అలైన్‌మెంట్ వివాదాలతో గడువులోపు ప్రాజెక్టు పూర్తి కాకపోగా, రాష్ట్ర ప్రభుత్వానికే తలనొప్పులను కలిగిస్తోంది. విజయవాడ వెస్ట్ బైపాస్‌లో మొత్తం ఆరు అలైన్‌మెంట్ల విషయంలో కాంట్రాక్టు ఉద్యోగి అలైన్‌మెంట్‌లను ఇష్టానుసారం మార్పులు, చేర్పులు చేసినట్టుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ మార్పుల కారణంగా ఎంతో మంది రైతులు నష్టపోగా.. కొంత మందికి మాత్రం జేబులు దండిగా నిండాయి. ఎన్‌హెచ్ అధికారులంతా సివిల్ పనులపై అవగాహన కలిగిన వారు. అలైన్‌మెంట్ వ్యవహారాలకు సంబంధించి వారికి పూర్తిగా పట్టు ఉండదు. దీనిని అదనుగా చేసుకుని ఆ కాంట్రాక్టు ఉద్యోగి విజయవాడ బైపాస్‌లో విశ్వరూపం చూపించాడని తెలుస్తోంది. అధీకృత సంతకాలు లేని అలైన్‌మెంట్లను పట్టుకెళ్లి క్షేత్ర స్థాయిలో పెగ్ మార్క్ చేయటం వ ంటి పనులతో రైతులు బెంబేలెత్తిపోయారు. అలైన్‌మెంట్ పేరుతో అక్కడ టవర్లు వస్తున్నాయి.. ఇక్కడ టవర్లు వస్తున్నాయంటూ రైతులను భయాందోళనలకు గురిచేశాడని తెలుస్తోంది. హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ టవర్ పడితే భవిష్యత్తులో తమ భూములను కొనేవారు ఎవరూ ఉండరని భయపడిన రైతుల నుంచి దండిగా లంచాలు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరం రూ.కోటిపైన ఖరీదు చేసే భూముల రైతుల నుంచి డబ్బులు తీసుకుని వేరే పొలంలోకి టవర్ వెళ్లే విధంగా అలైన్‌మెంట్‌ను ఫిక్స్ చేశాడని సమాచారం. ఇలా తన ఆఫర్‌ను ఆంగీకరించిన రైతులకు మేలు చేసినట్టు తెలిసింది. మొత్తం ఆరు లైన్ల విషయంలో కూడా కాంట్రాక్టు ఉద్యోగి ఇదే విధంగా వ్యవహరించాడని సమాచారం. ట్రాన్స్‌కో, పీజీసీఐఎల్, ల్యాంకో లైన్స్ అన్నింటి విషయంలోనూ ఆ ఉద్యోగి ఇదే విధంగా చేశాడని తెలుస్తోంది. ల్యాంకో లైన్స్‌ను అర్ధ చంద్రాకారంగా రైతుల పొలంలో తిప్పటం వెనుక కూడా ఆ ఉద్యోగి హస్తం ఉందని తెలుస్తోంది. టవర్లను రీ లొకేట్ చేస్తున్న కాంట్రాక్టు సంస్థతో కలిసి ఆ ఉద్యోగి ఇష్టానుసారం టవర్లను మార్చి గందరగోళాన్ని సృష్టించినట్టు సమాచారం. నున్న, సూరాయపాలెం రైతులు ఈ అలైన్‌మెంట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేయటంతో అసలు ఈ అలైన్‌మెంట్ ఏ విధంగా వస్తుందన్నదానిపై ఆయన కూడా విచారణకు ఆదేశించారు.
అధీకృత అలైన్‌మెంట్ ఎలా ఉండాలి ? క్షేత్ర స్థాయిలో ఏమి చేశారు?
ముందుగా నిర్దేశించుకున్న అలైన్‌మెంట్ ప్రకారం ఏయే రైతుల పొలాల్లో టవర్లు పడుతున్నాయో గుర్తించి ఆ రైతులకు ముందుగా సమాచారాన్ని తెలియపరచాలి. ఆ తర్వాత వారి సమక్షంలో టవర్ లొకేషన్ ఎక్కడ వస్తుందో అధికారిక అలైన్‌మెంట్ కాపీని చూపించి పెగ్ మార్క్ చేయాల్సి ఉంటుంది. కానీ, సదరు ఉద్యోగి అఽఽధీకృతం కానీ ప్లాన్ కాపీతో వచ్చి పెగ్ మార్కింగ్ పనులతో రైతులను భయాందోళనలకు గురి చేశారు. అధీకృత అలైన్‌మెంట్ కాపీ మీద ఏఈ, డీఈఈ, ఈఈ, ఎస్‌ఈ సంతకాలు ఉండాలి. ఆ తర్వాత ఎన్‌హెచ్ పీడీ సంతకాలు ఉండాలి. ఈ సంతకాలు అన్నీ ఉంటేనే అది అధీకృత అలైన్‌మెంట్ కాపీ అవుతుంది. ఎలాంటి సంతకాలు లేకుండా అలైన్‌మెంట్ ప్రింట్ తీసుకు వచ్చి రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. వీటి గురించి రైతులకు పెద్దగా తెలియదు. దీంతో అతడు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది.
డబుల్ దోపిడీ
అలైన్‌మెంట్ పేరుతో డబుల్ దోపిడీ జరిగిందని తెలుస్తోంది. ముందుగా ప్రస్తుత అలైన్‌మెంట్‌లో ఉన్న రైతులతో మాట్లాడి నీ పొలం నుంచి టవర్ తీసేస్తాం.. ఎంత ఇస్తావ్ ? అని బేరం పెట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత కొత్తగా వెళ్లే భూముల రైతులతో నీ పొలంలో టవర్ పడుతుంది! పడకుండా ఉండాలంటే ఎంత ఇస్తావ్? అంటూ బేరసారాలు సాగించినట్టు సమాచారం. ఇలా రైతుల అమాయకత్వాన్ని, ఖరీదైన భూములను కాపాడుకోవాలన్న వారి ఆశలను ఎంచక్కా మన కాంట్రాక్టు ఉద్యోగి భారీగా క్యాష్ చేసుకున్నట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బైక్‌పై వచ్చి.. కార్లను మార్చే రేంజ్‌కి..
కాంట్రాక్టు ఉద్యోగి ఎన్‌హెచ్‌లో ప్రవేశించే ముందు ఓ బైకును ఉపయోగించినట్టు సమాచారం. విజయవాడ వెస్ట్ బైపాస్ పుణ్యమా అని అతను ఇప్పుడు కారులో ఆఫీసుకు వచ్చే రేంజ్‌కు ఎదిగాడని తెలిసింది. ఒక కారు అయితే అనుకోవచ్చు.. ఇప్పటికి రెండు కార్లను మార్చినట్టు సమాచారం.
బైపాస్ వెంబడి పెట్రోల్ బంకు కోసం స్థలాన్వేషణ
సదరు కాంట్రాక్టు ఉద్యోగి విజయవాడ వెస్ట్ బైపాస్ వెంబడి పెట్రోల్ బంకును ఏర్పాటు చేయటానికి స్థలాన్వేషణ చేస్తున్నట్టు తెలిసింది. విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రారంభమయ్యే లోపు అనువైన స్థలాన్ని కొనుగోలు చేసి అందులో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలన్నది అతని ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. విజయవాడ వెస్ట్ బైపాస్ వెంబడి ఒక ఎకరం కొనాలంటే కనిష్టంగా రూ. కోటి నుంచి గరిష్టంగా రూ.7 కోట్ల వరకు ఉంది.