Share News

Deputy CM Pawan: మోదీ ఓ కర్మయోగి

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:04 AM

ప్రధాని మోదీ ఓ కర్మయోగి.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మన దేశ ప్రధానిగా ఉండటం మన అదృష్టం. ప్రపంచ దేశాల్లో భారత్‌ తలెత్తుకుని పొగరుగా నిలబడేలా మార్చిన గొప్పనేత అంటూ...

Deputy CM Pawan: మోదీ ఓ కర్మయోగి

  • ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ

  • భారత్‌ను తలెత్తుకొని నిలబడేలా మార్చారు

  • పన్నుల భారం తగ్గించడం చరిత్రలోనే లేదు

  • జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికీ ప్రయోజనం

  • 15 ఏళ్లు కూటమి స్థిరమైన పాలన అందించాలి

  • లోకేశ్‌కు అన్ని శాఖలూ నిర్వహించే సమర్థత ఉంది

  • కర్నూలు సభలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని మోదీ ఓ కర్మయోగి.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మన దేశ ప్రధానిగా ఉండటం మన అదృష్టం. ప్రపంచ దేశాల్లో భారత్‌ తలెత్తుకుని పొగరుగా నిలబడేలా మార్చిన గొప్పనేత’ అంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. కర్నూలులో గురువారం జరిగిన సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘దేశంలో పన్నుల భారం పెరగడం తప్ప.. తగ్గించిన చరిత్ర లేదు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల పేదలు, సామాన్యులకు పెద్దఎత్తున ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. విద్యా, వైద్యం ఖర్చుల భారం తగ్గుతుంది. నిత్యావసర వస్తు ధరలు తగ్గడం వల్ల ఒక్కో కుటుంబానికి రూ. 20 వేలు వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెట్టారు. ప్రధాని మోదీ కృషి కారణంగా దేశం, రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్‌ వంటి అతిపెద్ద ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చింది. ధర్మాన్ని పట్టుకొని ముందుకు సాగే వ్యక్తి మోదీ. రెండు తరాలను ముందుకు నడిపిస్తూ భావితరానికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి భారత్‌ను తీసుకెళ్లారు. ఒక దేశపు జెండా పౌరుషంగా ఎలా రెపరెపలాడుతుందో.. అలా మన దేశాన్ని ప్రపంచపటంలో తలెత్తుకునేలా నిలిపిన ఘనత మోదీదే.


రాష్ట్రంలో రూ. 13 వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక హబ్‌ అభివృద్ధికే రూ. 4 వేల కోట్లతో శంకుస్థాపన చేశారు. రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక ప్రగతి వైపు వేగంగా అడుగులు వేయడానికి కేంద్రం దోహదం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వం, సీఎం చంద్రబాబు స్ఫూర్తి, మార్గదర్శకత్వంలో ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు సుస్థిర పాలన అందిస్తూ, పెట్టుబడిదారులు, పరిశ్రమల ఏర్పాటుకు నమ్మకాన్ని కలిగిస్తూ ఉండాలి. అలా మేమంతా ముందుకు వెళ్తాం. సోదరుడు, మంత్రి లోకేశ్‌కు అన్ని శాఖలు ఇచ్చినా సమర్థవంతంగా పని చేయగలడు’’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

Updated Date - Oct 17 , 2025 | 04:07 AM