Share News

Minister Dola Veeranjaneyulu: సంక్షేమాధికారి బూతుపురాణం

ABN , Publish Date - Sep 20 , 2025 | 06:51 AM

ఉద్యోగులను బూతులు తిట్టడం, ఉద్యోగం తీసేయిస్తానంటూ వార్నింగ్‌లు ఇవ్వడం, మహిళా ఉద్యోగులనీ చూడకుండా అసభ్యంగా మాట్లాడటం, డ్రెస్సులపై కామెంట్లు చేయడం...

Minister Dola Veeranjaneyulu: సంక్షేమాధికారి బూతుపురాణం

  • ఉద్యోగులకు దూషణలు, వార్నింగ్‌లు

  • మహిళా అధికారులపైనా ఇదే తీరు

  • వారి దుస్తులపై వ్యాఖ్యలు

  • తిరుపతి జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ విక్రమ్‌రెడ్డి నిర్వాకం

  • విద్యార్థినులపైనా హేయమైన భాష

  • గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేల ఫిర్యాదు

  • శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తానన్న మంత్రి డోలా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగులను బూతులు తిట్టడం, ఉద్యోగం తీసేయిస్తానంటూ వార్నింగ్‌లు ఇవ్వడం, మహిళా ఉద్యోగులనీ చూడకుండా అసభ్యంగా మాట్లాడటం, డ్రెస్సులపై కామెంట్లు చేయడం, చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైనా నోరు పారేసుకోవడం... ఇదీ తిరుపతి జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ విక్రమ్‌రెడ్డి తీరు. తిరుపతి జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లను గాడిలో పెడతారని రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ఆ మధ్య నియమించిన ఆ అధికారి హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఆయన చేస్తున్న వింత, విచిత్ర విన్యాసాలు ఇటు సిబ్బందికి, అటు విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. విక్రమ్‌రెడ్డి వ్యవహారశైలిపై ఏపీ స్టేట్‌ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ తిరుపతి జిల్లా యూనిట్‌ ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారు. ఫిర్యాదు చేసిన సిబ్బందిపైనే గాక ఎమ్మెల్యేలపైనా నోరుపారేసుకున్నారని చెబుతున్నారు. జూమ్‌ మీటింగ్‌ల్లో సైతం ఉద్యోగులపై బూతుపురాణాలు మొదలు పెట్టారు. హాస్టళ్లలో ఉండే బాలికలు, అధికారుల పట్ల నోటికొచ్చినట్లు దూషణలకు దిగుతున్నారు. తనపై ఫిర్యాదు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని, శాశ్వతంగా ఉద్యోగాలకు దూరమవుతారని బెదిరిస్తున్నారు. తనకు మంత్రి పేషీ అధికారులు తెలుసని, కలెక్టర్‌ మిత్రుడని, ఏసీబీ అధికారులు తనకు సీనియర్లని పదే పదే బెదిరిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాకు అధికారిగా నియమించినప్పటి నుంచి ఆయన వైఖరి ఇలాగే ఉందని అంటున్నారు. పత్రికలో రాయలేని రీతిలో బూతులు తిడుతున్నారని వాపోతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మహిళా ఉద్యోగులు, బాలికలు మంచివాళ్లు కాదంటూ పదే పదే కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఎస్సీ హాస్టళ్లలో చదివే విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడటం ఆయనకు పరిపాటిగా మారిందంటున్నారు. ప్రతి సందర్భంలోనూ కలెక్టర్‌ తనకు బాగా దగ్గరని, ఏసీబీ డీఎస్పీ తనకు సీనియర్‌ అని, అందరి జాతకాలు తీస్తానని బెదిరిస్తున్నారని, తాము ఉద్యోగాలు మానేసుకోవాలని అనిపిస్తోందని పలువురు మహిళా అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతస్థాయి సమావేశంలో కలెక్టర్‌ ఆయనను వెనకేసుకు రావడంతో మరింత రెచ్చిపోతున్నారు. కలెక్టర్‌ ఆయనకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పచెప్పడంతో దానికి సంబంధించిన పనులు కూడా హాస్టల్‌ అధికారులకు అప్పగిస్తూ వారిపై స్వారీ చేస్తున్నారు. ఆయన మాటకు ఎవరైనా ఎదురు తిరిగితే అంతే సంగతులు. షోకాజ్‌ నోటీసులు, మెమోలు ఇస్తానని, సస్పెండ్‌ చేస్తానని బెదిరింపులు ఎక్కువయ్యాయని చెబుతున్నారు. ఇటీవల బదిలీల సందర్భంగా కూడా సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నారని, నాలుగో తరగతి సిబ్బంది అంటే ఈ అధికారికి చిన్నచూపని, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆరోపిస్తున్నారు. హాస్టల్‌ మహిళా అధికారుల డ్రెస్సులపై కామెంట్లు చేయడం, వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని చెబుతున్నారు. తన బూతుపురాణం ఎవరైనా రికార్డు చేస్తారేమోనన్న అనుమానంతో ఆయన ఆంక్షలు పెడుతున్నారు. ఈ అధికారి వద్దకు వెళ్లాలంటే ఉద్యోగులు ఫోన్లు బయట పెట్టి పోవాల్సిందేనట. తిరుపతి, చిత్తూరు జిల్లాల వారికి కలిపి జూమ్‌ మీటింగ్‌ పెట్టినప్పుడు వసతి గృహాలలో జరిగిన చిన్నచిన్న సంఘటనలు ప్రస్తావించి, సిబ్బందిని అవహేళన చేసి పైశాచిక ఆనందం పొందారని ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లా ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు తనకు మిత్రులని, వారికి చెప్పి విచారణ జరిపించి అంతుచూస్తానని, ఉద్యోగాలు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని చెబుతున్నారు. ప్రొటోకాల్‌ ఖర్చులు ఇవ్వని హాస్టల్‌ అధికారులకు చుక్కలు చూపిస్తానంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు.


మంత్రికి ఎమ్మెల్యేల ఫిర్యాదు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతికి వచ్చిన ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్‌.. సాంఘిక సంక్షేమ అధికారి విక్రమ్‌రెడ్డిపై మంత్రికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామికి ఈ అధికారి నిర్వాకంపై ఫిర్యాదు చేశారు. పేద ఎస్సీ విద్యార్థులను పర్యవేక్షించాల్సిన అధికారిగా ఇలాంటివారిని నియమించడం వల్ల హాస్టళ్లు మరింత దిగజారుతున్నాయని ఎమ్మెల్యేలు అన్నారు. ఈ అధికారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తామని, ఆయన స్థానంలో మరో అధికారిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.

Updated Date - Sep 20 , 2025 | 06:55 AM