MLA Kuna Ravi: నాపై ఆరోపణల వెనుక కుట్ర
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:38 AM
వైసీపీతో పాటు మరికొంతమంది తనపై కుట్ర పన్నారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మండిపడ్డారు.
వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారిని వదలను
పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే కూన రవి
ఆమదాలవలస, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీతో పాటు మరికొంతమంది తనపై కుట్ర పన్నారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మండిపడ్డారు. తన వ్యక్తిత్వంపై నిరాధార ఆరోపణలు చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టడంతో పాటు పరువు నష్టందావా వేస్తానన్నారు. ‘‘ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నా వ్యక్త్తిత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక కుట్ర ఉంది. కేజీబీవీ ప్రవేశాల విషయమై నా నియోజకవర్గంలోని ప్రిన్సిపాల్స్ అందరితో పాటు జిల్లా అధికారితో కలిసి గ్రూప్ వీడియోకాల్ మాట్లాడితే.. దాన్ని వక్రీకరిస్తూ ప్రిన్సిపాల్ సౌమ్య తప్పుడు ఆరోపణలు చేయడం తగదు. ఒక చోటా వైసీపీ నాయకుడి రాజకీయం కోసం.. సౌమ్య డ్రామా ఆడారు. ఆరోపణలు చేసిన వారితో పాటు మీడియాపైనా పోలీసులకు, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాను‘‘ అని హెచ్చరించారు. రవికుమార్‌కు కేజీబీవీ ప్రిన్సిపాళ్లు మద్దతుగా నిలిచారు. వీడియోకాల్‌లో సౌమ్యపై ఎమ్మెల్యే దుర్భాషలు ఆడలేదని చేయలేదని బూర్జ, ఆమదాలవలస ప్రిన్సిపాల్స్ చెప్పారు. ఎమ్మెల్యేపై ఆమె తిరుగుబాటు చేయడం బాధాకరమన్నారు. తమ సంఘం తరఫున సౌమ్యను పలుమార్లు హెచ్చరించినా, ఖాతరు చేయలేదని కేజీబీవీల సంఘం జిల్లా నాయకులు చెప్పారు. ఎమ్మెల్యేపై సౌమ్య ఆరోపణల వల్ల ఉద్యోగులుగా సిగ్గుపడుతున్నామని, ఎమ్మెల్యేకి బహిరంగ క్షమాపణ చెబుతున్నామని అన్నారు.