MLA Kotamreddy Sridhar Reddy: పెంచలయ్య కుటుంబానికి రూ.10 లక్షల సాయం
ABN , Publish Date - Dec 04 , 2025 | 07:05 AM
గంజాయి ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయిన సీపీఎం నాయకుడు పెంచలయ్య కుటుంబ పోషణకు తన వంతుగా రూ.10 లక్షలు అందచేస్తున్నట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.
అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరురూరల్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): గంజాయి ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయిన సీపీఎం నాయకుడు పెంచలయ్య కుటుంబ పోషణకు తన వంతుగా రూ.10 లక్షలు అందచేస్తున్నట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. సీపీఎం నాయకులతో కలిసి బుధవారం ఆయన కల్లూరిపల్లి వద్దనున్న ఆర్డీటీ కాలనీలోని పెంచలయ్య నివాసానికి వెళ్లి ఆయన భార్య దుర్గా, పిల్లలు కుమార్‌దేవ్, నిఖిలికి నగదు అందచేశారు. అనంతరం ఆ కుటుంబంతో ఏకాంతంగా మాట్లాడిన ఎమ్మెల్యే.. పెంచలయ్య ఇద్దరు బిడ్డలు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు తన కుమార్తెలైన హైందవి, వైష్ణవి ఆ బాధ్యతలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. అలాగే పెంచలయ్య చేసిన గంజాయి వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తిని చాటే విధంగా ఆర్డీటీ కాలనీలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాలనీ అభివృద్ధికి వారం రోజుల వ్యవధిలో రూ.50 లక్షలు నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తామన్నారు.