MLA Ganta Srinivasarao: నిబంధనలు అతిక్రమిస్తే మక్కెలు విరగ్గొడతారు
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:10 AM
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రోడ్డు మార్గంలో పర్యటిస్తాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ.. సవాళ్లు విసిరితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, మక్కెలు విరగ్గొట్టి మూలన కూర్చోపెడుతుందని...
జగన్ పర్యటనపై ఎమ్మెల్యే గంటా వార్నింగ్
విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రోడ్డు మార్గంలో పర్యటిస్తాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ.. సవాళ్లు విసిరితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, మక్కెలు విరగ్గొట్టి మూలన కూర్చోపెడుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. మాజీ సీఎం జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రతా కారాణాల రీత్యా హెలికాప్టర్‌లో వెళ్లాలని అధికారులు జగన్‌కు సూచిస్తే, దానిని ఆయన రాజకీయం చేస్తున్నారన్నారు. తమిళనాడులో సినీ హీరో విజయ్ కార్యక్రమంలో 41 మంది మరణించారని, మరోవైపు విశాఖలో మహిళల క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలోనే అనుమతి నిరాకరించారన్నారు. వైసీపీ హయాంలో పరామర్శలకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు వెళితే అడ్డంకులు కల్పించారని, తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తానని, ఎవరి హక్కులు హరించే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిన జగన్.. ఇప్పుడు వాటి కోసం కోటి సంతకాలు సేకరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే, అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంటు కార్మిక సంఘ నాయకులకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని జగన్ ఇప్పుడు వారి దగ్గరకు ఏ ముఖం పెట్టుకొని వెళతారని ప్రశ్నించారు. జగన్ వీకెండ్ పొలిటీషియన్ అని గంటా విమర్శించారు.