Share News

MLA Budda Rajasekhar Reddy Attacks: ఎమ్మెల్యే బుడ్డా ఆటవిక దాడి

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:55 AM

అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి దాడి చేశారు. తనకోసం ఫారెస్టు చెక్‌పోస్టు గేటు తీయలేదని, పిలవగానే దగ్గరకు రాలేదంటూ ..

MLA Budda Rajasekhar Reddy Attacks: ఎమ్మెల్యే బుడ్డా ఆటవిక దాడి

  • చెక్‌పోస్టు గేటు తీయలేదని అటవీ శాఖ సిబ్బందిపై ఆగ్రహావేశాలు

  • ఫారెస్టు పెట్రోలింగ్‌ ఉద్యోగులపై జులుం.. అనుచరులతో కలిసి భౌతిక దాడి

  • ఫారెస్టు వాహనంలోకి ఎక్కించి చిత్రహింసలు.. స్వయంగా నడుపుతూ చక్కర్లు

  • శ్రీశైలంలో ఘటన.. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు

నంద్యాల, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి దాడి చేశారు. తనకోసం ఫారెస్టు చెక్‌పోస్టు గేటు తీయలేదని, పిలవగానే దగ్గరకు రాలేదంటూ ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. అంతే ఆవేశంతో, అక్కడికి దగ్గరలోని ఫారెస్టు పెట్రోలింగ్‌ సిబ్బందిని పిలిపించి వారిపై జులుం ప్రదర్శించారు. వారిని బలవంతంగా పెట్రోలింగ్‌ వాహనంలోకి ఎక్కించి చిత్రహింసలు పెట్టారు. ఆ వాహనాన్ని ఎమ్మెల్యే స్వయంగా నడిపారు. తన అనుచరులతో కలిసి చెక్‌పోస్టు వద్ద బీభత్సం సృష్టించారు. బుధవారం ఈ ఘటన సోషల్‌ మీడియాలో కలకలం రేపింది. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తెలిపిన సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులతో కలిసి పలు వాహనాల్లో శ్రీశైలానికి వెళ్లారు. రాత్రి సుమారు 10గంటలకు వారి వాహనాలు శిఖరం దాటుకుని అటవీశాఖ చెక్‌పోస్టు వద్దకు చేరే సమయానికి గేటు వేసి ఉంది. ఎదురుగా 4వాహనాలు నిలిచి ఉన్నాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వెళుతున్న భక్తులకు చెందిన ఆ వాహనాలను.. సమయం అయిపోయిందంటూ చెక్‌పోస్టు సిబ్బంది నిలిపివేశారు. ఇది గమనించిన ఎమ్మెల్యే... ఆ భక్తుల వాహనాలను పంపించి, దారి వదలాలంటూ సిబ్బందికి దురుసుగా సూచనలు చేశారు. తనను చూడగానే గేటు తీయలేదని అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. ‘ఫారెస్టు సిబ్బందిని పిలవండి’ అంటూ కేకలు వేశారు. తన అనుచరులను పంపించి సమీపంలోని అటవీశాఖ మొబైల్‌ బీట్‌ సిబ్బందిని పిలిపించారు. వారంతా ఎర్రగొండపాలెం రేంజ్‌ నక్కంటి బీట్‌కు చెందిన సిబ్బంది. వారు రాగానే, బూతులతో ఎమ్మెల్యే, అనుచరులు రెచ్చిపోయారు. ఓ ఉద్యోగిపై చెయ్యి చేసుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపించాయి. ఎమ్మెల్యే, అనుచరులకు, అటవీ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఫారెస్టు వాహనంలోకి ఎక్కి.. నలుగురు ఉద్యోగులను బలవంతంగా ఎక్కించుకున్నారు. ఎమ్మెల్యే వాహనాల్లో ఆయన అనుచరులు ఎక్కి.. బుడ్డాను అనుసరించారు. అందరూ కలిసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అర్థరాత్రి వరకు వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఈ దాడిలో గాయపడిన వారిలో నక్కంటి డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ రాములునాయక్‌, చిన్నారుట్ల గార్డు గురువయ్య, డ్రైవర్‌ కరీముల్లా అనే వారిని గుర్తించారు. మరో గార్డు వివరాలు తెలియాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.


XXDBV.jpg

వివాదాల.. బుడ్డా..

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తరచూ వివాదాల్లోకి చిక్కుకుంటున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు దాడులు చేశారు. బుడ్డా వ్యవహారంపై టీడీపీ వర్గాల నుంచే అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

సీఎం ఆగ్రహం

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం నేరుగా అటవీ అధికారులతో మాట్లాడి, ఏం జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని, మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాగా, అటవీశాఖ అధికారులపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు పవన్‌ పేర్కొన్నారు. కాగా, అటవీ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న అఽధికారులను బంధించి, దాడికి దిగడం దారుణమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కాపురం యూనిట్‌ (ఏపీజేఎ్‌ఫవోఏ) ఎఫ్‌ఎ్‌సవో పి.కరీముల్లా డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 21 , 2025 | 05:55 AM