Share News

Anantapuram: ఏఆర్‌ కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే వర్గీయుల దాడి

ABN , Publish Date - Oct 12 , 2025 | 05:02 AM

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు, ఆయన అల్లుడు తమపై దాడి చేశారని ఏఆర్‌ కానిస్టేబుల్‌ హరినాథ్‌, ఆయన భార్య సుజాత ఆవేదన వ్యక్తం చేశారు.

Anantapuram: ఏఆర్‌ కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే వర్గీయుల దాడి

  • ఎమ్మెల్యే అమిలినేని అల్లుడు.. అనుచరులు కొట్టారు

  • ఫిర్యాదు చేస్తే.. సీఐ మమ్మల్నే బెదిరిస్తున్నారు

  • ఏఆర్‌ కానిస్టేబుల్‌ హరినాథ్‌ దంపతుల ఆవేదన

అనంతపురం క్రైం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు, ఆయన అల్లుడు తమపై దాడి చేశారని ఏఆర్‌ కానిస్టేబుల్‌ హరినాథ్‌, ఆయన భార్య సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద శనివారం వారు మీడియాతో మాట్లాడారు. ‘రాంనగర్‌ 80 అడుగుల రోడ్డులోని ఎలైట్‌ అపార్టుమెంట్‌లో మేం ఉంటున్నాం. అదే అపార్ట్‌మెంట్‌లో ఎమ్మెల్యే అనుచరులు, అల్లుడు ఉంటున్నారు. ఇంటి వద్ద మా పిల్లలు ఆడుకుంటుంటే తరచూ గొడవ పడుతున్నారు. దీని గురించి ప్రశ్నించినందుకు నా భర్త హరినాథ్‌ను, ఆయన స్నేహితుడు ప్రభాకర్‌ను ఇంటి కొచ్చి కొట్టారు’ అని సుజాత తెలిపారు. తాము వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా... తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని వాపోయారు. ‘ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఆయన అల్లుడు ధర్మతేజ, అనుచరులు అవినాశ్‌, సత్య మాపై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఎమ్మెల్యే అనుచరులను పోలీసులు లోన కూర్చోబెట్టి... మమ్మల్ని బయట నిలబెట్టారు’ అని సుజాత కంటతడి పెట్టారు. పోలీస్‌ స్టేషన్‌లో కూడా సీఐ, ఎస్‌ఐ ఎదుటే ఎమ్మెల్యే అనుచరులు తమను కొట్టారని చెప్పారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ అయిన తనకే న్యాయం జరక్కపోతే ఎవరికి చెప్పుకోవాలని హరినాథ్‌ వాపోయారు. ‘పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ కానిస్టేబుల్‌పై దాడి చేస్తే చర్యలు తీసుకోరా?’ అని కంటతడి పెట్టారు. దీనిపై వివరణ కోరేందుకు సీఐ జగదీ్‌షకు ఫోన్‌ చేయగా, ఆయన స్పందించలేదు.

Updated Date - Oct 12 , 2025 | 05:02 AM