Share News

AP Crime Report: నేరాల కట్టడిలో మోదం.. ఖేదం

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:32 AM

జరిగిన, జరుగుతున్న నేరాలపై ఏటా డిసెంబరులో సమీక్ష చేసుకుని.. పెరిగిన నేరాల కట్టడితో పాటు కొత్త సవాళ్లను కొత్త సంవత్సరంలో ఎదుర్కొనేందుకు ప్రణాళికను పోలీసు శాఖ సిద్ధం చేసుకుంటుంది.

AP Crime Report: నేరాల కట్టడిలో మోదం.. ఖేదం

  • రాష్ట్రంలో దాడులు, కిడ్నాపులు, హత్యలు తగ్గుదల

  • హత్యాచారాలు, దొంగతనాలు, మోసాలు పెరుగుదల

  • గంజాయి కేసులు, రోడ్డు ప్రమాదాలూ ఎక్కువే

  • సోషల్‌ సైకోల కట్టడి.. ఇతర సైకోలకు రోడ్డుపై కౌన్సెలింగ్‌.. నేరాల నియంత్రణలో డ్రోన్లు

  • గంజాయి కట్టడి.. డ్రగ్స్‌పై ప్రజా చైతన్యం

  • సైబర్‌ నేరాల్లో కేసులే కట్టడం లేదన్న ఆరోపణలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జరిగిన, జరుగుతున్న నేరాలపై ఏటా డిసెంబరులో సమీక్ష చేసుకుని.. పెరిగిన నేరాల కట్టడితో పాటు కొత్త సవాళ్లను కొత్త సంవత్సరంలో ఎదుర్కొనేందుకు ప్రణాళికను పోలీసు శాఖ సిద్ధం చేసుకుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నేరాల కట్టడికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిన రాష్ట్ర పోలీసులు.. సీసీ కెమెరాలు, డ్రోన్లు, టెక్నాలజీ, ప్రజల సహకారంతో సమకూర్చుకుని దూకుడు పెంచారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు లాంటి చోట్ల పోలీసింగ్‌ పెంచడంతో నేరాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్‌లో మార్పులొచ్చాయి. పేకాడే వారిని అరెస్టు చేయడం, వారిని డ్రోన్‌తో వెంబడించే దృశ్యాలు వెలుగులోకి రావడంతో అలాంటి డెన్లు తగ్గుముఖం పట్టాయి. కిడ్నాపులు ఏకంగా 15.8 శాతం తగ్గడానికి సీసీ కెమెరాలు, డ్రోన్లను వినియోగించడమే కారణం. గత వైసీపీ ప్రభుత్వంలో గుంపులుగా వెళ్లి దాడులకు దిగడం తరచూ జరిగేది. చంద్రబాబు ఇంటిపైకి స్వయంగా నాటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ దండయాత్ర.. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ మూకల విధ్వంసం.. పల్నాడులో రోడ్లపై వీరంగం సృష్టిస్తూ ఇళ్లల్లోకి దూరి దోపిడీలు.. అమరావతి మహిళలు మొక్కులు తీర్చుకోవడానికి దేవస్థానానికి వెళ్తున్నా దాడులు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళ్లినా దాడులే.. లోకేశ్‌ యువగళం పాదయాత్రలో పోలీసుల దన్నుతో కవ్వింపులు.. తన అక్కపై లైంగిక దాడికి పాల్పడిన వ్యకులను అడ్డుకున్న పాపానికి మైనర్‌ బాలుడిని తగులబెట్టిన ఘటన తదితర పరిస్థితులను చక్కదిద్ది శాంతిభద్రతలు నెలకొల్పేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈఏడాది 52.4శాతం రైటింగ్స్‌ తగ్గుముఖం పట్టాయి. పోలీసులు గర్వంగా చెప్పుకోవడానికి ఇదో పెద్ద ఉదాహరణ.


ఆందోళన కలిగిస్తున్న పెరుగుదల..

రాష్ట్రంలో ఈ ఏడాది బహిరంగ దాడులు.. కిడ్నాపుల్లాంటివి తగ్గినా హత్యాచారాలు, ఆత్మహత్యకు ప్రోత్సహించడం, నమ్మక ద్రోహం, దోపిడీలవంటివి పెరిగాయి. చీటింగ్‌ కేసులు, గంజాయి కేసులు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. 2024లో హత్యాచారాలు 1,291 నమోదైతే.. ఈ ఏడాది 1,582 కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హత్యలు కొంత తగ్గినా కల్పబుల్‌ హోమిసైడ్‌(నేరపూరిత హత్య) 19.8శాతం పెరిగాయి. నయవంచన కేసులు, ఆర్థిక మోసాలు 2024తో పోల్చితే 29.2శాతం అధికంగా నమోదయ్యాయి. మహిళలపై నేరాల కట్టడికి శక్తి బృందాలను ఏర్పాటు చేసిన పోలీసు శాఖ మహిళా ఐజీ పర్యవేక్షణలో చర్యలు చేపడుతున్నా అత్యాచారం కేసులు స్వల్పంగా పెరిగాయి.

నేరస్థులకు చుక్కలు..

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న శక్తులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా రప్పా రప్పా అంటూ అల్లరి మూక రెచ్చిపోతూనే ఉంది. రోడ్లపై విన్యాసాలు.. జంతు బలులు.. మహిళలపై దాడులు.. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి పోలీసులు ట్రీట్‌మెంట్‌ మార్చారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లా గ్యాంగ్‌ వార్‌కు నిలయంగా మారుతుండడం, మహిళలే డాన్లుగా ఎదిగి హత్యలు చేయిస్తుండడంతో కఠిన చర్యలకు ఉపక్రమించారు. అలాంటి గ్యాంగులను నడిరోడ్లపై నడిపిస్తున్నారు. దీంతో అల్లరి మూకలు వెనుకడుగు వేస్తున్నాయని పోలీసులు అంటున్నారు.


రక్తమోడుతున్న రోడ్లు..

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు వేల ప్రాణాలు తీశాయి. జనవరి నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8వేల మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. వీరిలో ద్విచక్ర వాహనదారులు అత్యధికంగా ఉంటే ఆ తర్వాతి స్థానంలో ఆటోలు, కార్లు నిలిచాయి. ఇటీవల కర్నూలు జిల్లాలో బస్సు దహనం తర్వాత సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టాక దిద్దుబాటు చర్యలు మొదలైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ హయాంలో ఇలా...

వైసీపీ ప్రభుత్వంలో దాడులు, హత్యలు, భూ కబ్జాలు, ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు, బాధితులపైనే రివర్స్‌లో తప్పుడు కేసులు నమోదయ్యేవి. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఎలాంటి బరితెగింపులకు పాల్పడినా అడిగే దిక్కుండేది కాదు. ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే దళిత యువకుడికి శిరోముండనం.. డాక్టర్‌ మాస్క్‌ అడిగితే పెడరెక్కలు విరిచి ఖాకీల దాడి.. టీవీ చర్చలో ప్రభుత్వాన్ని తప్పుబట్టిన ఎంపీపై థర్డ్‌ డిగ్రీ.. చివరకు హైకోర్టు న్యాయమూర్తులపై వ్యతిరేక పోస్టులు.. ఇలాంటి పరిస్థితి నుంచి ధన, మాన, ప్రాణాలతో పాటు రాష్ట్రాన్ని కూడా రక్షించుకోవాలని ప్రజలు అరాచక పాలనకు చరమగీతం పాడారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమిని ఎన్నుకున్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం..

విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసే క్రమంలో రాష్ట్రాన్ని పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్‌ కట్టడికి చంద్రబాబు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంఇస్తోంది. ఐదుగురు మంత్రుల కమిటీ సిఫారసుతో ‘ఈగల్‌’ టీమ్‌ ఏర్పాటు చేసి స్థానిక పోలీసులతో కలిసి గంజాయి మొక్కను కూకటి వేళ్లతో పెకిలించేసింది. కానీ గంజాయి సరఫరా పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు విద్యాసంస్థల్లో విరివిగా లభిస్తోంది. ఉత్తరాంధ్రలో డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, రాష్ట్రంలో ‘ఈగల్‌’ ఐజీ ఆకే రవికృష్ణ ప్రజల్లోకి వెళుతూ ’డ్రగ్స్‌ వద్దు బ్రో’ అంటూ చైతన్యం తెస్తున్నారు. కాగా, సోషల్‌ సైకోలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేసి జైలుకు పంపింది.

Updated Date - Dec 29 , 2025 | 03:34 AM