Agriculture Sector: ఆహార ధాన్యాల సాగు బాగు
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:19 AM
ఖరీఫ్ సాగు ముగింపు దశకు వచ్చింది. వర్షాలు గతి తప్పి రాష్ట్రంలో ఈ సీజన్‌లో రైతులు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినా...
పెరిగిన వరి, అపరాలు, చిరుధాన్యాల సాగు
అన్నదాతను ఆదుకున్న జలాశయాలు
వర్షాలు గతి తప్పి.. రైతుకు ఆటుపోట్లు
పత్తి, వేరుశనగ, నూనెగింజల విస్తీర్ణం తగ్గుదల
ఖరీఫ్ సీజన్‌లో మిశ్రమ ఫలితాలు
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
ఖరీఫ్ సాగు ముగింపు దశకు వచ్చింది. వర్షాలు గతి తప్పి రాష్ట్రంలో ఈ సీజన్‌లో రైతులు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినా నెలన్నర పాటు వర్షాలు సరిగ్గా కురవక, పంటల సాగు మందకొడిగా సాగింది. అయితే, జూలై 15 తర్వాత వర్షాలు కొంత ఆశాజనకంగా కురిశాయి. ఆగస్టు, సెప్టెంబరులో వరుస అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో ఖరీఫ్ సాగుపుంజుకుంది. మొత్తమ్మీద సాగులో మిశ్రమ ఫలితాలు కనిపించాయి!
కొన్ని జిల్లాల్లో వానలోటు..
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 616.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 579 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 696.27 మిల్లీమీటర్లు 661.59 మిల్లీమీటర్లు, రాయలసీమలో 438.01 మిల్లీమీటర్లు 483.56 మిల్లీమీటర్ల వాన పడింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో సగటున 51 రోజులు వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో 20నుంచి 63రోజులు వానలు పడ్డాయి. గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనా, ఇప్పటికీ కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో వానలోటు ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 77.90 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయన్న వ్యవసాయశాఖ అంచనాలో ఇప్పటికి 69.37 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి. అయితే ఈ ఏడాది వరి, చిరుధాన్యాలు, అపరాల సాగు విస్తీర్ణం కొంత పెరిగింది.
ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర, నాగావళి, వంశధార వంటి నదులకు వరదలు రావడంతో.. రాష్ట్రంలోని జలాశయాలు పూర్తిగా నిండాయి. జలాశయాల నుంచి ఆయకట్టుకు నీరు పుష్కలంగా విడుదల చేయడంతో వరి సాగు స్వల్పంగా పెరిగింది. ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో వరి విస్తీర్ణం రెండింతలు పెరిగింది. ఈ జిల్లాలో రబీ సీజన్‌లో వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో సాగునీటి లభ్యతతో వరి సాగు పెరిగింది. అయితే రాయలసీమలో సాగయ్యే వేరుశనగ విస్తీర్ణం సగానికిపైగా తగ్గింది. దక్షిణకోస్తా, రాయలసీమలో ఎక్కువగా సాగయ్యే పత్తి విస్తీర్ణం కూడా కొంత తగ్గింది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడం, కొన్ని చోట్ల చాలీచాలని వానల వల్ల మెట్ట పంటల విస్తీర్ణం తగ్గింది. ఆ మేరకు జలాశయాల నుంచి సాగునీరు పుష్కలంగా సరఫరా కావడంతో ఆహార ధాన్యాల పంటలు బాగా సాగయ్యాయి. ఈ సీజన్‌లో మిర్చి 4.90లక్షల ఎకరాల్లో సాగవుతుందని ఉద్యానశాఖ అంచనా వేసింది. ఇంకా మిరప మొక్కలు నాటుతున్నారు. కాగా, ఖరీఫ్‌లో వరి ధాన్యం ఎకరానికి 2,217.2కిలోల(29.56బస్తా) దిగుబడి వస్తుందని అర్ధగణాంక శాఖ పంటల మొదటి ముందస్తు అంచనా నివేదికలో తెలిపింది.