Share News

GST Reforms: కొన్నింటికే జీఎస్టీ పండగ

ABN , Publish Date - Sep 23 , 2025 | 04:21 AM

గతంలో నాలుగు శ్లాబులు(5, 12, 18, 28 శాతం)గా ఉన్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను రెండు శ్లాబులకు (5, 18శాతం) కుదించారు. జీఎస్టీ తగ్గింపుతో చాలారకాల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయన్నారు

GST Reforms: కొన్నింటికే జీఎస్టీ పండగ

  • తొలి రోజు జీఎస్టీ వరాలపై మిశ్రమ ప్రభావం

  • పూర్తిస్థాయిలో అమల్లోకి రాని కొత్త శ్లాబులు

  • తగ్గని నిత్యావసర వస్తువుల ధరలు

  • కార్లు, బైకులపై మాత్రం భారీగా తగ్గింపు

  • వాహనాల కొనుగోళ్లతో షోరూమ్‌లు కళకళ

  • ఎలక్ర్టానిక్‌ వస్తువులపైనా ధరలు తగ్గింపు

  • మందులపై మాత్రం ఇంకా పాత ధరలే

  • కొత్త విధానంపై పాత స్టాక్‌ ప్రభావం

  • చాలాచోట్ల కనిపించని ధరల పట్టికలు

దిగిరాని నిత్యావసరాలు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. ఇప్పటికే ఉన్న స్టాక్‌ క్లియర్‌ అయ్యేంత వరకు కొత్త శ్లాబులు అమలు చేయలేమని వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడా తగ్గించిన ధరల బోర్డులు కనిపించలేదు. ఎంఆర్‌పీ లేనివాటిపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం లేదు.

వాహనాలు మరింత ‘జోరు’

కార్ల ధరలు రూ.60 వేల నుంచి రూ.1.9 లక్షల వరకు, ద్విచక్ర వాహన ధరలు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాహనాల షోరూమ్‌లు కళకళలాడాయి. రేట్లు భారీగా తగ్గడంతో కొనుగోళ్లు జోరందుకున్నాయి.

ఎలక్ట్రానిక్స్.. ఓకే

ఏసీ, టీవీ, డిష్‌ వాషర్ల ధరలు తగ్గాయి. ఆయా వస్తువులపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు ధరలు తగ్గించారు. పలు ప్రాంతాల్లో టీవీలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపారు.

మందులు.. మార్పు లేదు

మందుల ధరల తగ్గింపుపై జీఎస్టీ ప్రభావం అంతగా కనిపించలేదు. రాష్ట్రంలో చాలా చోట్ల పాత ధరలకే విక్రయించారు.

ఇదీ కారణం!

కేంద్ర ప్రభుత్వం పలు నిత్యావసర సరుకులు, మందులు తదితర వస్తువులపై జీఎస్టీ తగ్గించినా.. తొలిరోజు సోమవారం చాలా చోట్ల ధరలు తగ్గలేదు. పాత స్టాక్‌ ఉండటం, వాటికి పాత జీఎస్టీ చెల్లించి కొనుగోలు చేసినందున.. వాటి విక్రయాలు పూర్తయ్యేవరకు ధరలు తగ్గించలేమని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ పూర్తి కాలేదని మరికొందరు అంటున్నారు.


‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడి

గతంలో నాలుగు శ్లాబులు(5, 12, 18, 28 శాతం)గా ఉన్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను రెండు శ్లాబులకు (5, 18ు) కుదించారు. జీఎస్టీ తగ్గింపుతో చాలారకాల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయన్నారు. ప్రజలకు పెద్దఎత్తున లబ్ధి కలుగుతుందని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది ముందుగానే దసరా, దీపావళి వచ్చాయని అన్నారు. తగ్గించిన జీఎస్టీ దేశవ్యాప్తంగా సోమవారం అమల్లోకి వచ్చింది. మరి.. కేంద్రం చెప్పినట్టుగా వస్తువుల ధరలు భారీగా తగ్గాయా? ప్రజలకు పండగ వచ్చిందా? ఏయే వస్తువుల ధరలు తగ్గాయి? పాత, కొత్త ధరల్లో వ్యత్యాసం ఎంత? ఏయే వస్తువులకు ధరలు తగ్గలేదు? నిర్మలా సీతారామన్‌ ఆదేశించినట్టుగా షాపుల వద్ద తగ్గిన ధరలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశారా?


గ్రేటర్‌ విశాఖలో..

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా తీసుకువచ్చిన నూతన శ్లాబుల అమలు విశాఖలో అంతంతమాత్రంగానే ఉంది. తగ్గిన ధరలతో కూడిన బోర్డులను ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కొద్దిచోట్ల మాత్రం ‘తగ్గించిన జీఎ్‌సటీ రేట్లు వర్తింపజేస్తున్నాం’ అంటూ బోర్డులు పెట్టారు కానీ ధరల వివరాలేవీ కనిపించలేదు. పాలు, పాల ఉత్పత్తులు ధరలు మినహా నిత్యావసర సరుకుల ధరలను ఎక్కడా తగ్గించలేదు. కొన్ని రిటైల్‌ స్టోర్లు, మాల్స్‌లో జీఎస్టీ శ్ల్లాబులు తగ్గించినట్టు బోర్డులు పెట్టినా, గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. మందుల ధరలను కూడా జీఎస్టీ శ్ల్లాబుల్లో మార్పులు చేసి గతంలో విక్రయించిన రేట్లకే అమ్మకాలు సాగిస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు మాత్రం తగ్గాయి. కార్ల ధరలు రూ.60 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గించి విక్రయాలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే ద్విచక్ర వాహనాల ధరలు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు తగ్గినట్టు షోరూమ్‌ నిర్వాహకులు అమలు చేస్తున్నారు. ఏసీ, టీవీ, డిష్‌ వాషర్స్‌ ధరలు తగ్గాయి. ఇప్పటివరకు 28 శాతం జీఎస్టీలో ఉన్న ఈ వస్తువులను ప్రస్తుతం 18 శాతం జీఎస్టీలోకి మార్చి విక్రయాలు సాగిస్తున్నారు. ఆయా వస్తువులపై రూ.2500 నుంచి రూ.5 వేలు వరకు తగ్గిస్తున్నారు. రోగులకు మేలు చేసే ఉద్దేశంతో కొన్నిరకాల మందులపై 12 శాతం ఉన్న జీఎస్టీని కేంద్రం 5 శాతానికి తగ్గించింది. అయితే విశాఖ నగర పరిధిలోని మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకులు మాత్రం ఈ శ్లాబుల అమలును పట్టించుకోవడం లేదు. మధురవాడ ప్రాంతానికి చెందిన ఒకరు సోమవారం షుగర్‌, బీపీకి సంబంధించిన మందులను కొనుగోలు చేశారు. రూ.818 బిల్లు చేతిలో పెట్టారు. రెండు నెలల క్రితం అంతే మొత్తం బిల్లు చెల్లించారు. బిల్లులో జీఎస్టీ శ్ల్లాబులను 12 నుంచి 5 శాతానికి తగ్గించినట్టు చూపినప్పటికీ, డిస్కౌంట్లను సరిచేసి చేసి పాత రేట్లకు విక్రయించారు. ఈ మెడికల్‌ స్టోర్‌ జనరిక్‌ కావడం గమనార్హం. ఇతర మెడికల్‌ స్టోర్స్‌లోనూ ఇదే పరిస్థితి.


రాయలసీమలో..

జీఎస్టీ సంస్కరణల అమలుతో అనంతపురం జిల్లాలో ద్విచక్ర వాహనాలు, కార్ల షోరూమ్‌లు కిటకిటలాడాయి. బైక్‌లపై రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు, కార్లపై రూ.50 వేల నుంచి రూ.1.90 లక్షల వరకు ధరల తగ్గుదల కనిపించింది. దీంతో కొందరు వాహనాలను బుక్‌ చేసుకోగా, మరికొందరు నచ్చిన బైక్‌, కార్లను డెలివరీ తీసుకున్నారు. అనంతపురం నగరంలోని ఒక్కో బైక్‌ షోరూమ్‌లో సోమవారం ఒక్కరోజే ఆరు నుంచి పది బైక్‌లను బుక్‌ చేసుకున్నారు. చాలా షోరూమ్‌లలో 5 బైక్‌ల వరకూ డెలివరీ తీసుకున్నారు. కార్ల షోరూమ్‌లలో 5 నుంచి 10 వరకు బుక్‌ అయ్యాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల వినియోగదారులు వివిధ రకాల వస్తువులు, వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. టీవీలపై జీఎస్టీ తగ్గించడంతో విక్రయాలు జోరందుకున్నాయి. ఇక బొలెరో వాహనంపై రూ.95 వేలు తగ్గింది. కడప జిల్లాలో వాహనాలు, టీవీలు, ఎలక్ర్టానిక్స్‌పై జీఎస్టీ తగ్గుదల కనిపించింది. కాగా పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. వ్యాపారులు పాత రేట్లకే సరుకులు అమ్ముతున్నారు. వ్యాపారులను ప్రశ్నంచగా.. పాత జీఎస్టీ చెల్లించి సరుకులు తీసుకొచ్చామని.. కొత్త సరుకు వచ్చేంత వరకు పాత రేట్లే కొనసాగుతాయని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో దాదాపు అన్ని రకాల దుకాణాల్లోనూ ధరల పట్టికలు అందుబాటులో లేవు. తిరుపతి జిల్లాలో తొలిరోజు పెద్దగా ప్రభావం కనిపించలేదు. వ్యాపార సంస్థలు పన్ను తగ్గింపు, ధరల మార్పునకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌లో బిజీగా ఉన్నాయి. 90ు అమ్మకాలు పాత ధరలతోనే జరిగాయి. ప్రొవిజన్స్‌ స్టోర్స్‌, సూపర్‌ మార్కెట్లు, చిల్లర దుకాణాల వరకూ ఎక్కడా తగ్గించిన ధరలకు విక్రయాలు జరగలేదు. అయితే మెడికల్‌ షాపుల్లో మాత్రం మందులు తగ్గించిన ధరలతో విక్రయించారు.


కోస్తాంధ్రలో..

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నెల్లూరు జిల్లాలో పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. జీఎస్టీ ఫలాలు సామాన్యులకు అందేందుకు కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్రధానంగా నిత్యావసరాల విషయంలో ఈ పరిస్థితి ఉంది. సూపర్‌ మార్కెట్లలో నిత్యావసరాల ధరలు తగ్గినా సాధారణ దుకాణాల్లో పాత సరుకు పేరుతో పాత ధరనే కొనసాగిస్తున్నారు. మరో పది రోజుల వరకూ సరుకు ఉంటుందని, పాత జీఎస్టీ ప్రకారం ఆ సరుకును కొన్నందున, అదే ధరకు అమ్మకపోతే నష్టం వస్తుందని రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు. నెల్లూరులో చాలా చోట్ల వ్యాపారులు తగ్గించిన ధరల బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఏలూరు జిల్లాలో నిత్యావసరాలు, పాల ప్యాకెట్ల ధరలు తగ్గలేదు. కందిపప్పు రూ.110, పెసరపప్పు రూ.110, సన్‌ప్లవర్‌ ఆయిల్‌ రూ.150, పామాయిల్‌ రూ.115, బెల్లం రూ.60, వెల్లుల్లి పాయలు రూ.150, చింతపండు రూ.300, మినపగుళ్లు రూ.110, పొట్టు పప్పు రూ.90 పాత ధరలకే విక్రయాలు చేశారు. ఎలక్ర్టికల్‌ ఉపకరణాల ధరలు తగ్గాయి. 2 నుంచి 5 వేల వరకు కొనుగోలుదారులకు లబ్ధి కలుగుతోంది. ఏలూరు నగరంలో పలు దుకాణాల్లో అమ్మకాలు పుంజుకున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏసీలు, డిష్‌వాష్‌, వాషింగ్‌ మెషిన్లు ధరలు తగ్గాయి. వాహనాల షోరూమ్‌లు కొనుగోలుదారులతో సందడి నెలకొంది. జీఎస్టీ తగ్గింపు ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజు అంతగా కనిపించలేదు. వ్యాపారులు జీఎస్టీ తగ్గింపు బోర్డులు పెట్టలేదు. విజయవాడలో వాహనాలు, ఎలకా్ట్రనిక్స్‌ పరికరాల ధరలు భారీగా తగ్గాయి. తగ్గించిన ధరలు అందుబాటులోకి వచ్చాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ ధరలు రూ.1,76,625 నుంచి రూ.1,62,161కు, రూ.1,49,900 నుంచి 1,37,640కు తగ్గాయి.

- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌

Updated Date - Sep 23 , 2025 | 04:24 AM