Anakapalle: మిట్టల్ స్టీల్‌కు పర్యావరణ అనుమతి వాయిదా
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:16 AM
జిల్లాలోని నక్కపల్లి ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో ఏర్పాటుకానున్న ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంటుకు పర్యావరణ అనుమతుల జారీపై కమిటీ తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.
పర్యావరణ నిర్వహణకు 3540 కోట్ల వ్యయం అంచనా
అనకాపల్లి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నక్కపల్లి ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో ఏర్పాటుకానున్న ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంటుకు పర్యావరణ అనుమతుల జారీపై కమిటీ తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్‌లో 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తమ రూ.1.5 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారానికి పర్యావరణ అనుమతుల కోసం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలకు ‘ఆర్సెల్లార్ మిట్టల్’ దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ అక్టోబరు 30న సమావేశమైంది. వివిధ అంశాలపై చర్చించిన కమిటీ మరింత సమగ్ర సమాచారం సేకరించిన తరువాత అనుమతులు జారీ చేసే ఉద్దేశంతో పర్యావరణ అనుమతుల ఇచ్చే అంశాన్ని వాయిదా వేసింది. నక్కపల్లి ఏపీఐఐసీ పారిశ్రామిక పార్క్‌కు పర్యావరణ అనుమతులు ఉన్నందున, ఇప్పుడు స్టీల్‌ప్లాంటుకు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న యాజమాన్యం వాదనపై కంట్రోలర్ ఆఫ్ పొల్యూషన్ నుంచి వివరణ తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. మిట్టల్ స్టీల్ ప్లాంటు కోసం పర్యావరణ నిర్వహణకు సుమారు రూ.3,540 కోట్లు వ్యయం అవుతుందని కమిటీ అంచనా వేసింది.