Public Approval: మిట్టల్ నిప్పన్ స్టీల్‌కు ప్రజామోదం
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:21 AM
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల పరిధిలోని విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ భూముల్లో ‘ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్’ స్టీల్ కంపెనీ ఏర్పాటుకు స్థానికులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు ఆమోదం తెలిపారు.
ప్లాంటు ఏర్పాటును స్వాగతించిన అన్ని పార్టీల నాయకులు
ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి
అనకాపల్లి/నక్కపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల పరిధిలోని విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ భూముల్లో ‘ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్’ స్టీల్ కంపెనీ ఏర్పాటుకు స్థానికులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు ఆమోదం తెలిపారు. మండలంలోని చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామంలో కలెక్టర్ కె.విజయ్‌కృష్ణన్ అధ్యక్షతన పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశాలకు సంబంధించి శనివారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. కూటమితో పాటు ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులంతా అభివృద్ధి కోసం ఇటువంటి పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారు. అయితే స్టీల్ ప్లాంటు నిర్మాణ దశ నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా ఆర్సెల్లార్, మిట్టల్ స్టీల్ కంపెనీ ఈడీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఉక్కును ఉత్పత్తి చేస్తామని, ఇదే సమయంలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.