Share News

ACB Court: పోలీసు కస్టడీకి మిథున్‌రెడ్డి

ABN , Publish Date - Sep 19 , 2025 | 04:30 AM

మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి (ఏ4)ని ఏసీబీ కోర్టు రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చింది.

ACB Court: పోలీసు కస్టడీకి మిథున్‌రెడ్డి

2 రోజులు అనుమతించిన ఏసీబీ కోర్టు

విజయవాడ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి (ఏ4)ని ఏసీబీ కోర్టు రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు గురువారం తీర్పు ఇచ్చారు. లిక్కర్‌ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు మిథున్‌రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు పిటిషన్‌ వేశారు. దీనిపై వాదనలు పూర్తవ్వడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు. శుక్రవారం, శనివారం కస్టడీ విచారణకు అనుమతిచ్చారు. మిథున్‌రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. సిట్‌ అధికారులు మిథున్‌రెడ్డిని శుక్రవారం ఉదయం అక్కడ అదుపులోకి తీసుకొని, ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత విజయవాడకు తరలిస్తారు. మరోవైపు మద్యం స్కాం కేసులో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్లు వేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాటిని వెనక్కి తీసుకున్నారు. వాటి స్థానంలో గురువారం రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Updated Date - Sep 19 , 2025 | 04:31 AM