Share News

Mithun Reddy: నాకేం తెలీదు.. కోర్టులో తేల్చుకుంటా

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:45 AM

నాకేం తెలీదు. మీరు పెట్టిందే తప్పుడు కేసు. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటా అని సిట్‌ విచారణలో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నట్లు తెలిసింది.

Mithun Reddy: నాకేం తెలీదు.. కోర్టులో తేల్చుకుంటా

  • సిట్‌ విచారణకు సహకరించని మిథున్‌

  • కేసులో ఇరికించారని సిట్‌ అధికారులతో వాదన

  • ముగిసిన కస్టడీ.. రాజమండ్రి జైలుకు తరలింపు

అమరావతి/విజయవాడ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘నాకేం తెలీదు. మీరు పెట్టిందే తప్పుడు కేసు. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటా’ అని సిట్‌ విచారణలో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు రెండో రోజు శనివారం కూడా ఆయన్ను ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్టు సమాచారం. మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల సేకరణ వరకూ అన్నీ తానై చక్రం తిప్పినట్టు ఆరోపణలున్న మిథున్‌ రెడ్డి విచారణలో తనకు ఏమీ తెలీదని చెప్పారు. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కేసులో ఇరికించారని సిట్‌ అధికారులతో వాదనకు దిగినట్లు సమాచారం. దేశంలోనే అతిపెద్ద లిక్కర్‌ స్కామ్‌లో అత్యంత కీలకమైన నలుగురు నిందితుల్లో ఒకరైన మిథున్‌ రెడ్డిని కోర్టు అనుమతితో ప్రత్యేక దర్యాప్తు బృందం రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం విజయవాడలోని పోలీస్‌ కమిషనరేట్‌లో నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చి 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకూ విచారించారు. తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తీసుకెళ్లారు. శనివారం కూడా దాదాపు ఇదే సమయాన్ని పాటించారు. సిట్‌ అధికారుల విచారణకు మిథున్‌ రెడ్డి ఏ మాత్రం సహకరించలేదని తెలిసింది. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల పర్సంటేజీ ఖరారు, ఆటోమెటిక్‌ మద్యం సరఫరా విధానాన్ని మాన్యువల్‌గా మార్పించడం తదితర అక్రమాలు, అవకతవకలు, అవినీతిపై రెండు రోజుల్లో వంద ప్రశ్నలు సంధించారు. సిట్‌ అధికారులు ఏది అడిగినా మిథున్‌ రెడ్డి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ‘నాకు సంబంధం లేని వాటిలో నన్ను ఇబ్బంది పెట్టింది మీరే.


చెయ్యని, తెలియని విషయాల గురించి అడిగితే నేనేమి సమాధానం చెప్పగలను. నాకేమీ తెలీదు’ అంటూ అడ్డంగా వాదించినట్లు తెలిసింది. మద్యం ముడుపుల పర్సెంటేజీని ఎవరి ఆదేశాలతో నిర్ణయించారు? లిక్కర్‌ పాలసీ రూపకల్పన జరిగిన సమావేశాల్లో మీరెందుకు పాల్గొన్నారు? ఆదాన్‌ డిస్టిల్లరీస్‌ నుంచి మీ పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఖాతాలకు జరిగిన లావాదేవీల సంగతేంటి? అని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ‘మాకు కన్‌స్ట్రక్షన్‌, ఇతర వ్యాపారాలున్నా లిక్కర్‌ బిజినెస్‌ లేదు. ఒక రాజకీయ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు పలుచోట్లకు వెళ్లడం, పదిమందిని కలవడం అత్యంత సాధారణ విషయం. అలానే నేను కూడా ఎక్కడెక్కడికో వెళతా. ఆ సమయంలో అక్కడ ఎవరు ఎందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నారో నాకెలా తెలుస్తుంది’ అని మిథున్‌ రెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ‘వైసీపీ ప్రభత్వం రాక ముందు ఉన్న మద్యం సరఫరా ఆటోమెటిక్‌ విధానాన్ని మాన్యువల్‌గా మార్చేందుకు మొత్తం పాత్ర మీదేనని మా విచారణలో తేలింది’ అని అధికారులు అడగ్గా.. ‘మీరు ఏది అడిగినా నేను చెప్పేది ఒక్కటే. మీరు చేస్తున్నది తప్పు. మీరు పెట్టిన కేసు తప్పు. నాపై ఇంకెన్ని నిందలు వేస్తారో.. ఎన్ని ఆరోపణలు చేస్తారో మీ ఇష్టం. మీరేమి చేసుకున్నా నేను కోర్టులోనే తేల్చుకుంటా’ అని మిథున్‌ రెడ్డి అన్నట్లు సమాచారం. రెండు రోజుల కస్టడీలో మిథున్‌ రెడ్డి దేనికీ సూటిగా సమాధానం చెప్పకపోవడంతో ఇదే విషయాన్ని కోర్టుకు వివరించి కస్టడీ మరింత పొడిగించాలని సిట్‌ అధికారులు కోరే అవకాశం ఉంది. విచారణ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. విచారణలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయాధికారి పి.భాస్కరరావు ఆయనను ప్రశ్నించారు. తనను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని మిథున్‌రెడ్డి చెప్పారు. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పది నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు న్యాయాధికారి అనుమతించారు. అనంతరం రాజమండ్రి జైలుకు తరలించారు.

Updated Date - Sep 21 , 2025 | 06:29 AM