Share News

Rajahmundry Jail Clarifies: కోర్టు ఆదేశాల మేరకే మిథున్‌కు సౌకర్యాలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:07 AM

న్యాయస్థానం మిథున్‌రెడ్డికి అనుమతించిన న్యాయవాదుల జాబితాలో నల్లకోటు లేని న్యాయవాది ఎస్‌ఎం సాధిక్‌ హుస్సేన్‌ పేరు లేదు. అతడిని ములాఖత్‌ కోసం వచ్చిన వారితో లోపలకు ఎలా అనుమతిస్తాం? అని...

Rajahmundry Jail Clarifies: కోర్టు ఆదేశాల మేరకే మిథున్‌కు సౌకర్యాలు

  • జైలు వెలుపల హంగామాతో సంబంధం లేదు

  • హుస్సేన్‌ను లోపలికి అనుమతించలేదు

  • రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ వివరణ

రాజమహేంద్రవరం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘న్యాయస్థానం మిథున్‌రెడ్డికి అనుమతించిన న్యాయవాదుల జాబితాలో నల్లకోటు లేని న్యాయవాది ఎస్‌ఎం సాధిక్‌ హుస్సేన్‌ పేరు లేదు. అతడిని ములాఖత్‌ కోసం వచ్చిన వారితో లోపలకు ఎలా అనుమతిస్తాం?’ అని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ ప్రశ్నించారు. హుస్సేన్‌ వ్యవహారంపై బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. ములాఖత్‌కు వచ్చిన వారితో హుస్సేన్‌ జైలు గుమ్మం వరకూ వెళ్లారని రాశారని, తాము ఆ న్యాయవాదిని అనుమతించడం లేదని వివరించారు. కానీ లిక్కర్‌ స్కామ్‌లో ఏ4 ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడ హుస్సేన్‌ హంగామా చేస్తున్నారు. మొదట్లో నల్లకోటు వేసుకుని హడావుడి చేసేవారు. అతడి వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టిన తర్వాత నల్లకోటు తీసేసి, చడీచప్పుడు కాకుండా తిరుగుతున్నారు. మంగళవారం మిథున్‌రెడ్డి తండ్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్‌కు వచ్చినపుడు హుస్సేన్‌ స్వయంగా ఆయన వద్దకు వెళ్లి దండాలు పెట్టడం.. పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలసి సెంట్రల్‌ జైలు ప్రధాన గుమ్మం వరకూ వెళ్లడం.. తర్వాత వారితోనే కలిసి బయటకు రావడం తెలిసిందే. ఆయన వైసీపీ నేతలతో వెళుతుంటే జైలు సిబ్బంది ఆపలేదు. ఇవన్నీ సీసీ కెమెరాలలో రికార్డయి ఉంటాయి.


కానీ జైలు సూపరింటెండెంట్‌ అతన్ని లోపలికే రానీయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. సెంట్రల్‌ జైలు ప్రధాన గేటు వద్ద గుంపులుగా ఉన్నవారిని నిరోధించడానికి ప్రత్యేక దళాలు చర్యలు తీసుకుంటున్నాయని, కారాగారం వెలుపల కొంతమంది చేసే హంగామాకు తమకేమీ సంబంధం లేదని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే వారానికి మూడు ములాఖత్‌లు ఇస్తున్నామని తెలిపారు. పెద్దిరెడ్డి, తలశిలకు మిథున్‌రెడ్డితో పరిపాలనా భవనంలో 25 నిమిషాల పాటు ఇన్నర్‌ ములాఖత్‌ ఇచ్చామని, బయట వేచి ఉన్న జక్కంపూడి రాజాకు ఇంటర్వ్యూ గదిలో 5 నిమిషాల పాటు గ్రిల్‌ ములాఖత్‌ ఇచ్చామని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే మిథున్‌రెడ్డికి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

Updated Date - Aug 07 , 2025 | 05:07 AM