SIT: మిథున్‌రెడ్డిపై లుక్ అవుట్ నోటీసు
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:33 AM
దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
విదేశాలకు పారిపోకుండా ‘సిట్’ అప్రమత్తం
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతతో కదలికలపై నిఘా
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలుచేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన కొద్ది గంటల్లోనే సిట్ అప్రమత్తమైంది. ఆయన దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునే చర్యలకు ఉపక్రమించింది. ఆయన కదలికలపై నిఘా పెట్టింది. మద్యం పాలసీ రూపొందించడం నుంచి పైసా వసూల్ వరకూ ప్రతి చోటా మిథున్ పాత్రపై ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం స్కాంలో రాజ్ కసిరెడ్డి(ఏ-1), మిథున్‌రెడ్డి (ఏ-4) అత్యంత కీలకమైన వ్యక్తులు. ఈ స్కాంలో అంతిమ లబ్ధిదారు తర్వాతి స్థానం మిథున్‌రెడ్డిదే. కుంభకోణం వెనుక మాస్టర్ మైండ్ అన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ జిల్లా నుంచి ఎంత.. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత.. వారాంతానికి వసూలైన సొమ్మెంత.. ఆ డబ్బును ఎక్కడ భద్రపరిచాం.. ఎవరికి అందజేశాం.. తదితర వివరాలన్నీ బిగ్ బాస్‌కు మిథున్ చెప్పేవారని తెలుస్తోంది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు సేకరించి హవాలా నెట్‌వర్క్ నడిపిన రాజ్ కసిరెడ్డికి అడుగడుగునా సహకారం అందించారని సమాచారం. దోపిడీకి వీలుగా కీలక స్థానాల్లో అనుయాయులైన అధికారులను నియమించడంలో.. సరఫరా ఆర్డర్ల జారీ విధానాన్ని ఆటోమేటిక్ నుంచి మాన్యువల్‌గా మార్చడంలో.. ఒక్కో మద్యం కేసు నుంచి దాని ధర ఆధారంగా ఎంత వసూలు చేయాలో తుది నిర్ణయం మిథున్‌రెడ్డిదేనని సిట్ గుర్తించింది. ఆయన్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు కూడా అభిప్రాయపడిన దరిమిలా ఆయన్ను అదుపులోకి తీసుకోవడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ-38), వెంకటేశ్‌నాయుడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య, దిలీ్‌పకుమార్ సహా 11 మందిని సిట్ అరెస్టు చేసింది. వీరిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అప్పటి సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, నాటి ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప కూడా ఉన్నారు.