SIT to Mithun Reddy: ఆయనకు అన్నీ తెలుసు
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:05 AM
మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తున్నామో ‘సిట్’ కారణాలను వివరించింది. విచారణ సందర్భంగా ఆయన సహాయ నిరాకరణ చేశారని...
కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలి అందుకే మిథున్ అరెస్టు: సిట్
మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తున్నామో ‘సిట్’ కారణాలను వివరించింది. విచారణ సందర్భంగా ఆయన సహాయ నిరాకరణ చేశారని... కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరముందనీ వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మిథున్ అరెస్టుకు ‘సిట్’ చెప్పిన కారణాలివి...
మద్యం స్కామ్‌లో లోతైన నేరపూరిత కుట్ర ఉంది. ఇందులో... ప్రైవేటు వ్యక్తులతోపాటు ఉన్నతస్థాయి అధికారులు, నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉంది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించాం. ముడుపుల డబ్బులు ఎక్కడి నుంచి ఎలా చేరాయో, సహ కుట్రదారులెవరో మిథున్ ద్వారా తెలుసుకోవాలి. సాక్ష్యాధారాలను ‘ట్యాంపర్’ చేయకుండా చూడాలి.
మద్యం పాలసీ రూపకల్పన, అమలు, ముడుపులు సేకరించడంలో సహ నిందితులతో సమన్వయంలో మిథున్‌దే కీలక పాత్ర.
ఐఏఎస్ హోదా కల్పిస్తామంటూ ఏ3 సత్యప్రసాద్‌కు హామీ ఇచ్చి... ఈ కుట్రలోకి లాగింది మిథున్ రెడ్డే.
ఏపీ బేవరేజ్ కార్పొరేషన్‌కు చెందిన అధికారులతో (ఏ3, ఏ4) పలుమార్లు మిథున్ రెడ్డి సమావేశమయ్యారు.
ఎస్పీవై ఆగ్రో, సాన్‌హాక్ ల్యాబ్స్, డెర్ట్ లాజిస్టిక్స్, పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్ ద్వారా లావాదేవీలు జరిగాయి. పీఎల్‌ఆర్ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థ.
స్కామ్‌లో మిథున్ ప్రత్యక్ష ప్రమేయం గురించి ముగ్గురు సాక్షులు స్పష్టమైన వాంగ్మూలం ఇచ్చారు.
మద్యం ముడుపుల్లో సేకరించిన డబ్బులను 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం ఉపయోగించారు.
ముడుపుల ద్వారా వచ్చిన సొమ్ములను ఎక్కడెక్కడ దాచారు, ఎలా తరలించారనే పూర్తి సమాచారం మిథున్‌కు తెలుసు. ఆ వివరాలన్నీ రాబట్టాల్సి ఉంది. డబ్బు తరలించేందుకు సృష్టించిన షెల్ కంపెనీల గుట్టూ తెలుసుకోవాల్సి ఉంది.