Share News

ACB Court: మిథున్‌రెడ్డికి బెయిల్‌

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:47 AM

మద్యం కుంభకోణంలో ఏ4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది.

ACB Court: మిథున్‌రెడ్డికి బెయిల్‌

  • పలు షరతులతో మంజూరు చేసిన కోర్టు

  • రాజమండ్రి జైలు నుంచి విడుదల

  • జైలు వద్ద పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం

  • మిథున్‌రెడ్డికి బెయిల్‌.. విడుదల

విజయవాడ/రాజమహేంద్రవరం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన తీర్పును న్యాయాధికారి పి.భాస్కరరావు వెలువరించారు. రూ.2 లక్షల పూచీకత్తును సమర్పించాలని, సోమవారం, శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు సిట్‌ ఎదుట హాజరుకావాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, కేసు గురించి బయట మాట్లాడొద్దని, ల్యాండ్‌లైన్‌, ఆధార్‌కార్డు, మొబైల్‌ నంబరు కోర్టులో ఇవ్వాలని షరతులు విధించింది. జూలై 19న సిట్‌ అధికారులు మిఽథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 71 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. బెయిల్‌పై కోర్టు తీర్పు అనంతరం సోమవారం సాయంత్రం 5.55 గంటల సమయంలో జైలు నుంచి మిథున్‌రెడ్డి విడుదలయ్యారు.


జైలు వద్ద వైసీపీ శ్రేణుల హల్‌చల్‌

మిథున్‌రెడ్డి విడుదల సందర్భంగా జైలు బయట గుమిగూడిన వైసీపీ నాయకులు హల్‌చల్‌ చేశారు. వారిని నిలువరించడం పోలీసులకు తలకుమించిన భారమైంది. ఒక దశలో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జైలు నుంచి బయటకు వచ్చాక, అక్కడ ఉన్న శ్రేణులకు మిథున్‌రెడ్డి అభివాదం చేసుకుంటూ కారెక్కారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే సీటీఆర్‌ఐ రోడ్డులో వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున గుమిగూడారు. సుమారు 50 కార్లు, 200పైగా బైక్‌లతో ర్యాలీ చేశారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో ప్రభుత్వాస్పత్రికి వెళుతున్న అంబులెన్స్‌లు ఇబ్బంది పడ్డాయి. వైసీపీ హయాంలో ఓ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రస్తుత ఎమ్మెల్యే వాసు బెయిల్‌పై విడుదల అయినప్పుడు పోలీసులు టీడీపీ శ్రేణులను తీవ్రంగా నియంత్రించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ అప్పారావు, వాసులకు అప్పటి డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మిథున్‌రెడ్డి ర్యాలీకి అనుమతి ఉందా? అని జనం ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 04:48 AM