During SIT Questioning: తెలీదు.. నాకు సంబంధం లేదు విచారణలో మిథున్ రెడ్డి తీరు
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:03 AM
గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల సేకరణ వరకూ అన్నీ తానై చక్రం తిప్పినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్‌రెడ్డి...
యాభై ప్రశ్నలు.. అన్నింటికీ ఒక్కటే జవాబు
మద్యం ముడుపులు ముట్టుకోలేదు
లిక్కర్ పాలసీ రూపకల్పనలో లేను
4 గంటలు ప్రశ్నించి రాజమండ్రి జైలుకు..
నేడు మరోసారి విచారించనున్న ‘సిట్’
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపుల సేకరణ వరకూ అన్నీ తానై చక్రం తిప్పినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్‌రెడ్డి, విచారణలో మాత్రం తనకు ఏమీ తెలియదని చెప్పినట్టు తెలిసింది. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అడ్డగోలుగా వాదించినట్లు సమాచారం. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్‌లో అత్యంత కీలకమైన నలుగురు వ్యక్తుల్లో మిథున్ రెడ్డి ఒకరని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది. కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి ఆయనను తీసుకున్న సిట్ అధికారులు విజయవాడలోని పోలీస్ కమిషరేట్‌లో నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు ఆయనను తీసుకొచ్చారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3వరకూ న్యాయవాదుల సమక్షంలో ఆయనను విచారించారు. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల పర్సెంటేజీ ఖరారు, ఆటోమెటిక్ మద్యం సరఫరా విధానాన్ని మాన్యువల్‌గా మార్పించిన వైనం, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్‌కు ఐఏఎస్ హోదా ఆశ కల్పించి మద్యం దోపిడీకి మార్గం చూపించుకున్న తీరు తదితర అక్రమాలు, అవకతవకలు, అవినీతిపై 50 ప్రశ్నలు సంధించారు. అయితే, సిట్ అధికారులు ఏది అడిగినా మిథున్ రెడ్డి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేదని తెలిసింది. ఏ ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పకపోగా.. ‘నాకు సంబంధం లేదు.. నాకేమీ తెలియదు..’ అంటూ తల అడ్డంగా ఊపినట్లు సమాచారం. ఒక్కో కేసుకు(బాక్స్)రూ.450 నుంచి రూ.600గా మద్యం ముడుపుల రేటును ఎవరి ఆదేశాలతో నిర్ణయించారని అడగ్గా, అలాంటి పని తాను చేయలేదని బదులిచ్చారు. లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం మాజీ రాజ్యసభ సభ్యుడి ఇంట్లో జరిగిన సమావేశాల్లో మీరు ఉన్నట్లు టెక్నికల్ ఆధారాలున్నాయని సిట్ అధికారులు తెలపగా, ఒక పార్టీలో ఎంపీలుగా ఉన్నప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్లి కలవడం అత్యంత సాధారణ విషయమని, దానికీ మద్యం ముడుపులకు ఏంటి సంబంధమని ఎదురుప్రశ్నించినట్లు తెలిసింది.
ఆ ప్రశ్నపై మిథున్ మౌనం!
మద్యం సరఫరాకు అనుసరిస్తున్న ఆటోమెటిక్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాన్యువల్‌గా మార్చారు. దీనివెనుక మొత్తం పాత్ర మిథున్‌రెడ్డిదేనని సిట్ భావిస్తోంది. దీనిపై ప్రశ్నించగా, ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆయన మౌనం వహించినట్లు సమాచారం. మీ కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలోకి డిస్టిలరీస్ ఖాతాల నుంచి రూ.ఐదు కోట్లు ఎందుకు జమైందని అడగ్గా, అది ముడుపుల సొమ్ము కాదని, ఏదో ఇతరత్రా లావాదేవీలు జరిపామని మిథున్ తెలిపారు. ఆ సొమ్ము అప్పుడే వెనక్కి ఇచ్చేశామని బదులిచ్చినట్లు తెలిసింది. అయితే పలుమార్లు నగదు రూపంలో మద్యం వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బు సంగతేంటని అధికారులు అడగగా.. తాను ఎవరినుంచీ రూపాయి కూడా తీసుకోలేదని సమాధానమిచ్చారు. అయితే 2019 ఎన్నికల నాటి అఫిడవిట్‌లో ఉన్న ఆస్తి 2024నాటికి బాగా పెరిగిందని, దానిపై ఆదాయపు పన్ను శాఖకు లెక్కలు చెప్పారా. అని అడగ్గా, అవునని సమాధానం ఇచ్చారు. ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్‌కు ఐఏఎస్ హోదా కల్పిస్తామని హామీ ఇవ్వడం వెనుక మద్యం దోపిడీయే ప్రధాన ఎజండానా అని ప్రశ్నించగా, తాను ఎవ్వరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని మిథున్ రెడ్డి బదులిచ్చారు. ఆయన దేనికీ సూటిగా సమాధానం చెప్పక పోవడంతో ఇదే విషయాన్ని కోర్టుకు వివరించి కస్టడీ మరింత పొడిగించమని కోరే అవకాశం ఉంది. కాగా, శనివారం మరోమారు సిట్ ఆయనను ప్రశ్నించనుంది. దీనికోసం మరో యాభై ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.