Share News

Liquor Scam: మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

ABN , Publish Date - Aug 30 , 2025 | 06:21 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించేందుకు మధ్యంతర బెయిల్‌, మద్యం కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ ఇప్పించాలని ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ

Liquor Scam: మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

  • జైలు నుంచి విడుదలైన దిలీప్‌

విజయవాడ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించేందుకు మధ్యంతర బెయిల్‌, మద్యం కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ ఇప్పించాలని ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వచ్చే నెల రెండో తేదీకి వాయిదా పడింది. అదేవిధంగా కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెరుకూరి వెంకటేష్‌ నాయుడు దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌పై విచారణ కూడా 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పైలా దిలీప్‌కు బెయిల్‌ మంజూరు కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. దిలీప్‌ సతీమణి కోర్టుకు శుక్రవారం పూచీకత్తులను సమర్పించారు. సిట్‌ అధికారులు తన తల్లిని బెదిరిస్తున్నారని లీప్‌ ఏసీబీ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సిట్‌ అధికారులను ఆదేశిస్తూ విచారణను మూడో తేదీకి కోర్టు వాయిదా వేసింది.


కోర్టుకు హాజరైన వరుణ్‌ పురుషోత్తం

మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వరుణ్‌ పురుషోత్తం విజయవాడ ఏసీబీ కోర్టుకు శుక్రవారం హాజరయ్యాడు. స్కాంలో నగదు లావాదేవీలు నిర్వహించిన వారి ఆస్తులను జప్తు చేస్తామని సిట్‌ అధికారులు మొత్తం 11 మందికి ఏసీబీ కోర్టు అనుమతితో నోటీసులు జారీ చేశారు. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, కాశీచయనుల శ్రీనివాస్‌, పైలా దిలీప్‌, వరుణ్‌ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ డిస్టిలరీస్‌ అధినేత నల్లనన్‌ మతప్పన్‌, ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అధినేత నల్లనన్‌ మేతప్పన్‌, ఎస్‌బీఐ చెన్నై శాఖ, హైదరాబాద్‌ ఐసీఐసీఐ బ్రాంచ్‌, విజయవాడ ఖజానా అధికారికి ఈ నోటీసులు అందజేశారు. వారిలో వరుణ్‌ పురుషోత్తం కోర్టుకు హాజరై తన అభిప్రాయాన్ని మెమో రూపంలో తెలియజేశాడు. నల్లనన్‌ మతప్పన్‌ తరపున న్యాయవాది హాజరయ్యారు.

Updated Date - Aug 30 , 2025 | 06:21 AM