Share News

ప్రజాధనం దుర్వినియోగం!

ABN , Publish Date - Aug 25 , 2025 | 01:04 AM

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నగదు, వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చిన ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు అధికారులు పప్పుబెల్లం మాదిరిగా పంచిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లు పనులు చేయకున్నా.. చేసినట్లుగా చూపి నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది కాలంలో రూ.9.06 కోట్ల బిల్లుల చెల్లింపులు చేసిన విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది.

ప్రజాధనం దుర్వినియోగం!

-కాంట్రాక్టర్లకు పప్పుబెల్లంలా కార్పొరేషన్‌ నిధులు

- పనులు చేయకున్నా బిల్లులు మంజూరు ?

- సీఎఫ్‌ఎంఎస్‌కు బదులుగా చెక్కుల రూపంలో అందజేత

- ఏడాది వ్యవధిలో రూ.9.06 కోట్ల బిల్లుల మాయ

- అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నగదు, వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చిన ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు అధికారులు పప్పుబెల్లం మాదిరిగా పంచిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లు పనులు చేయకున్నా.. చేసినట్లుగా చూపి నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది కాలంలో రూ.9.06 కోట్ల బిల్లుల చెల్లింపులు చేసిన విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల పారదర్శకంగా ఉండేలా సీఎఫ్‌ఎంఎస్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. కానీ మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో బిల్లుల చెల్లింపులు దీనికి భిన్నంగా చెక్కుల రూపంలో ఇస్తున్నారు. ఏడాది కాలంలో 78 బిల్లులను చెక్కుల రూపంలో ఇచ్చారు. రూ.9.06 కోట్ల బిల్లులు చెల్లించగా, ఇందులో రూ.5.59 కోట్లు బడ్జెట్‌ ఆమోదం ఉన్నవి, బడ్జెట్‌ ఆమోదం లేనివి 3.47కోట్లు ఉండటం విశేషం. గతంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అకౌంటెంట్‌ ఉండేవారు కాదు. తమకు అనుకూలమైన ఒక జూనియర్‌ అసిస్టెంట్‌తో కథ నడిపేవారు. ఇటీవల కాలంలో అకౌంటెంట్‌ వచ్చారు. సీఎఫ్‌ఎంఎస్‌ పద్ధతిలో ప్రభుత్వానికి తెలిసేలా బిల్లులు చేయకుండా, చెక్కుల రూపంలో బిల్లులు చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీనిపై కమిషనర్‌ గాని, ఇతర అధికారులు గాని పట్టించుకోలేదని సమాచారం. చెక్కుల రూపంలో బిల్లులు చేయడం నిబంధనలకు విరుద్ధమైనా రూ. 9.06 కోట్లకు పైగా బిల్లులను చేయడం గమనార్హం. ఈ అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా కొందరు వివరాలు కోరితే అసలు విషయం బయటకు వచ్చింది. మచిలీపట్నం పురపాలకసంఘంలో జరిగే అభివృద్ధి పనులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకే అప్పగిస్తారనే ప్రచారం ఉంది. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతాప్రమాణాలతో చేయకున్నా బిల్లులు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి కార్పొరేషన్‌ కార్యాలయంలో పనిచేసే అధికారులు, కాంట్రాక్టర్లు ఒక్కటై గుట్టు చప్పుడు కాకుండా నిధులను దారి మళ్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది కాలంగా కార్పొరేషన్‌లో చెల్లింపులు చేసిన బిల్లులు, వాటికి సంబంధించిన పనుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరితే నాలుగైదు పనులకు బిల్లులు చేసినా ఏ పని, ఎక్కడ, ఎప్పుడు చేశారనే వివరాలు వెల్లడించలేదు.

అక్రమాలు ఇలా..

- మునిసిపల్‌ కార్పొరేషన్‌ నిధుల నుంచి ఏప్రిల్‌ 4వ తేదీన రూ.4.60 లక్షలను సీజీఎస్‌టీ, ఏజీఎస్‌టీ పేరుతో ఒక కాంట్రాక్టర్‌కు చెందిన ఆడిటర్‌ పేరుతో మంజూరు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ కాంట్రాక్టరుపై అధికారులకు ఇంత ప్రేమ ఎందుకువచ్చిందని కార్యాలయ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. గుమ్మటాల చెరువు చుట్టూ ఫెన్సింగ్‌, మరమ్మతు పనుల కోసం రూ.7లక్షలను ఈ ఏడాది ఏప్రిల్‌ 18వ తేదీన మంజూరు చేశారు. ఈ చెరువు వద్ద పనులు నామమాత్రంగానే చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

- కార్పొరేషన్‌ పరిధిలోని 40 సచివాలయాల్లో మరమ్మతుల పనుల కోసం ఏప్రిల్‌ 15వ తేదీన రూ.4.44 లక్షలను బిల్లులు చేసినట్లుగా చూపారు. ఈ పనులు ఎక్కడ ఎంత మేర చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది డిసెంబరులో ఓ కాంట్రాక్టరు పేరున రూ.5.26 లక్షలను బిల్లులుగా చేశారు. ఏ పని చేశారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో పాటు ఈ ఏడాది జనవరి 28వ తేదీన రూ.3.74 లక్షలను అదే కాంట్రాక్టర్‌ పేరున బిల్లు చేశారు. ఈ నిధులు ఏ పని కోసం చెల్లించారో తెలియజేయకపోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 24వ తేదీన ఓ కంపెనీ పేరుతో మచిలీపట్నం మెడికల్‌ కళాశాలకు తాగునీటి పనుల కోసం రూ.1.57 కోట్లను బిల్లులు చేసినట్లుగా చూపారు. మచిలీపట్నం మెడికల్‌ కళాశాలకు సంబంధించి మునిసిపల్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి బిల్లులు మంజూరు చేయాల్సి ఉండగా, మునిసిపల్‌ కార్పొరేషన్‌ జనర ల్‌ ఫండ్స్‌ నుంచి బిల్లులు చేయడం విశేషం.

- కమిషనర్‌ కారు అద్దె ప్రాతిపదికన ఉంది. ఈ కారుకు మరమ్మతుల పేరుతో రూ.85 వేలు, ఎంఈ కార్‌ బిల్లులకు రూ.32 వేలు ఇచ్చారు. ఎంఈకి కారు లేకున్నా బిల్లులు పెట్టినట్లు సమాచారం. మునిసిపల్‌ కమిషనర్‌ కారు అద్దెది కాగా, కారు యజమాని రిపేర్లను చూసుకోవాలని, కానీ మునిసిపల్‌ నిధులను ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని కార్యాలయ ఉద్యోగులు అంటున్నారు. ఆయిల్‌ బిల్లుల పేరుతో రూ.3.25 లక్షలను బిల్లులను ఈ ఏడాది మార్చి 15వతేదీన మంజూరు చేయడం గమనార్హం. ఏ బిల్లులైనా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే చేయాలని మునిసిపల్‌ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కానీ ఏ కారణంతో చెక్కుల రూపంలో బిల్లులు చేశారనే అంశంపై విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కొందరు మునిసిపల్‌ కార్యాలయ అధికారులు అంటున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 01:04 AM