Share News

దయనీయం

ABN , Publish Date - Dec 03 , 2025 | 01:27 AM

దిత్వా తుఫాను నేపథ్యంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా తయారైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కంకులు తడిచి వరి నేలవాలుతోంది. దీంతో పంట చేతికి అందుతుందోలేదోననే భయం రైతన్నను వెంటాడుతోంది. దీనికి తోడు మేఘాలు కమ్మేసి సూర్యుడు బయటకు రాకపోవడంతో పట్టాలు కప్పేసి ఉంచిన ధాన్యం ఆరబెట్టడానికి అవకాశం లేక అవస్థలు పడుతున్నారు. తేమశాతం పెరిగి రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు, వ్యాపారులు ధరలు తగ్గించి అడగడం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది.

దయనీయం

- అన్నదాతల్లో ’దిత్వా’ గుబులు

- జిల్లాలో పడుతున్న వర్షాలు

- తడిసి నేలవాలుతున్న వరి

- పంట చేతికందదంటున్న రైతులు

- సూర్యుడు రాక.. ఆరబెట్టలేక పట్టాల కిందే రోజుల తరబడి ధాన్యం

- తేమశాతం పెరిగి రంగు మారుతుందని ఆందోళన

- ఇదే అదనుగా ధర తగ్గించి అడుగుతున్న వ్యాపారులు, మిల్లర్లు

దిత్వా తుఫాను నేపథ్యంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా తయారైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కంకులు తడిచి వరి నేలవాలుతోంది. దీంతో పంట చేతికి అందుతుందోలేదోననే భయం రైతన్నను వెంటాడుతోంది. దీనికి తోడు మేఘాలు కమ్మేసి సూర్యుడు బయటకు రాకపోవడంతో పట్టాలు కప్పేసి ఉంచిన ధాన్యం ఆరబెట్టడానికి అవకాశం లేక అవస్థలు పడుతున్నారు. తేమశాతం పెరిగి రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు, వ్యాపారులు ధరలు తగ్గించి అడగడం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో ఇప్పటి వరకు 55 వేల హెక్టార్లకుపైగా వరి కోతలు పూర్తయ్యాయి. మరో 1.06 లక్షల హెక్టార్లలో పంట కోతకు సిద్ధంగా ఉంది. దిత్వా తుఫాను నేపథ్యంలో అధిక శాతం మంది రైతులు వరి కోతలను వాయిదా వేశారు. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తుడటంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట రోజుల తరబడి తడిచి నానిపోతోంది. బలమైన గాలులు వీస్తే తడిచి బరువెక్కిన కంకుల కారణంగా వరిపైరు నేలవాలిపోతుందని రైతులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా సూర్యుడు కనిపించకుండా ఆకాశం మేఘావృతమై ఉండటం, తేలికపాటి వర్షాలు పడటంతో చేతికందే దశలో ఉన్న పంటకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి మచిలీపట్నం, గుడివాడ, చల్లపల్లి, మోపిదేవి, తదితర ప్రాంతాల్లో ఒకమోస్తరు వర్షం కురిసింది.

రాశులపైనే ధాన్యం

మోపిదేవి మండలంలోని పెదప్రోలు వెంకటాపురం, పెదకళ్లేపల్లి, కొక్కిలిగడ్డ, మోపిదేవి తదితర గ్రామాల్లో రహదారుల వెంబడి ధాన్యం రాశులుగానే ఉండిపోయింది. పెదప్రోలు వద్ద జాతీయ రహదారి-216పై అరకిలో మీటరుకుపైగా ధాన్యం రాశులు పరదాలు కప్పి ఉంచారు. మొవ్వ మండలంలో భట్లపెనుమర్రు, పెడసనగల్లు, కాజ, అవురిపూడి, చినముత్తేవి, కారకంపాడు, మొవ్వ, కోసూరు, నిడుమోలు తదితర గ్రామాల్లో ధాన్యం సంచులకు ఎత్తి ఉన్నవాటితో పాటు, రాశులు పోసి నాలుగైదు రోజులైంది. ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో లేవనే కారణంతో రహదారులపైనే ఉంచేశారు. గత ఐదు రోజులుగా అలానే ఉండిపోయాయి. మొవ్వ మండలంలోని 21 పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో ఎక్కడికక్కడ ఽధాన్యం రాశులపైనే ఉండిపోయింది. గూడూరు మండలం తరకటూరు, గూడూరు తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గుడివాడ, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో నాలుగైదురోజుల క్రితం కోత కోసిన పంట పనలపైనే ఉంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి పనలు తడిచి ముద్దయ్యాయి. గుడివాడ మండలంలో మంగళవారం కూడా కోతలు కోశారు. మఽధ్యాహ్నం నుంచి వర్షం కురవడంతో పనలు తడిచిపోయాయి.

బస్తా ధాన్యం రూ.1,400

యంత్రాలతో కోసిన ధాన్యంలో తేమశాతం అధికంగా ఉందనే కారణంతో రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు రహదారులపైకి చేర్చారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ధాన్యం విక్రయించేందుకు రైతులు వ్యాపారులు, మిల్లర్ల వద్దకు వెళితే 75 కిలోల బస్తా ధాన్యం రూ.1,400 నుంచి రూ.1,450 వరకు అడుగుతున్నారు. దీంతో రైతులు ధాన్యంలో తేమశాతం 17 పాయింట్లు వచ్చే వరకు ఆరబెడదామనే ఉద్దేశంతో అలానే ఉంచేశారు. గత మూడు రోజులుగా ఆకాశం పూర్తిస్థాయిలో మేఘాలు కమ్మి ఉండటంతో ధాన్యం రాశులపై ఉన్న పరదాలను తొలగించేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఒకటీ రెండు రోజులపాటు ఆరబెట్టిన ధాన్యం రాశులుగా ఉంటే రంగు మారే అవకాశాలు తక్కువని, యంత్రాల ద్వారా కోసిన ధాన్యం రాశులుగా పోసి ఒకరోజు కూడా ఆరబెట్టకుండా ఉంటే ధాన్యం రంగు మారి పోవడంతో పాటు, నాణ్యత దెబ్బతింటుందని రైతులు భయపడుతున్నారు. మొంథా తుఫాను కారణంగా పంట ఎకరానికి ఐదు నుంచి ఏడు బస్తాల వరకు తగ్గిందని చెబుతున్నారు. ప్రస్తుతం దిత్వా తుఫాను ప్రభావంతో వర్షం పడుతుండటంతో కోత కోయాల్సిన పంట దెబ్బతిని ఎంతమేర నష్టం వాటిల్లుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 01:28 AM