Share News

మినుము రైతు వెతలు

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:05 AM

ఈ ఏడాది మినుము పంట సాగు చేసిన రైతులకు నిరాశే మిగులుతోంది. తుఫాన్లు, వరదల కారణంగా సాగు ఆలస్యం కావడంతో దిగుబడి ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు పడిపోయింది. గతేడాది క్వింటా రూ.7,700 పలికిన ధర ఈ ఏడాది రూ.7,200 వద్దే ఆగిపోయింది. పంట అమ్ముకుంటే పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7,400లకు పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.

మినుము రైతు వెతలు

- ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు మించని దిగుబడి

- సాగు ఆలస్యం కావడంతో తగ్గిన దిగుబడులు

- మార్కెట్‌లో లభించని మద్దతు ధర

- గతేడాది క్వింటా రూ.7,700.. ఈ ఏడాది రూ.7,200

- దిక్కుతోచని స్థితిలో రైతులు

ఈ ఏడాది మినుము పంట సాగు చేసిన రైతులకు నిరాశే మిగులుతోంది. తుఫాన్లు, వరదల కారణంగా సాగు ఆలస్యం కావడంతో దిగుబడి ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు పడిపోయింది. గతేడాది క్వింటా రూ.7,700 పలికిన ధర ఈ ఏడాది రూ.7,200 వద్దే ఆగిపోయింది. పంట అమ్ముకుంటే పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7,400లకు పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 3.50 లక్షల ఎకరాల్లో రైతులు మినుము పంటను సాగు చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో ఆగస్టు నెలాఖరు, సెప్టెంబరు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు, బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా రోజుల తరబడి వరిపైరు నీటిలో ఉండి చనిపోయింది. దీంతో రైతులు రెండో విడతగా వరినాట్లు వేశారు. ఈ కారణంగా వరికోతలు ఆలస్యమయ్యాయి. వరి కోతల సమయంలో వర్షాలు కురవడంతో యంత్రాల ద్వారా వరికోతలు పూర్తి చేసిన రైతులు, పొలాలను దమ్ముచేసి మరీ మినుము విత్తనాలు చల్లారు. రబీ సీజన్‌లో మినుము సాగుకు సంబంధించి 20 నుంచి నెల రోజుల పాటు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం మినుము పంట దిగుబడిపై పడింది.

పురుగు మందులకు అధికంగా ఖర్చు

రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకుని మినుము పంటను సాగు చేస్తే ఎకరానికి కనీసంగా ఆరు క్వింటాళ్లు, అధికంగా ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది పంట సాగుకాలం కొంతమేర అనుకూలించకపోవడంతో కంకిపాడు, ఉయ్యూరు. పామర్రు, తోట్లవల్లూరు, దివిసీమ ప్రాంతంలోని చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ తదితర మండలాల్లో ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడికి మించి రావడం లేదు. ఈ ఏడాది మినుము సాగులో పురుగు మందులకే ఎకరానికి రూ.20 వేలకు తక్కువ కాకుండా రైతులు ఖర్చుచేశారు. మినుము పైరుకు ఎల్లోమొజాయిక్‌, ఆకుముడత, బూడిద తెగుళ్ల నివారణ కోసం, పూతరావడానికి, వచ్చినపూత నిలబడటానికి, పిందె రాలిపోకుండా ఉండటానికి పలు దఫాలుగా వివిధ రకాల రసాయనాలను పిచికారీ చేయడంతో పురుగు మందుల ఖర్చు అధికమైంది. వివిధ రకాల పురుగు మందుల కంపెనీల ఏజెంట్లు మినుము పంట పొలాలను పరిశీలించి పైరుకు ఏవేవో తెగుళ్లు వ్యాపించాయని, వీటి నిర్మూలన కోసం పురుగు మందులను పిచికారీ చేయాలని తమదైన శైలిలో సూచనలు చేశారు. రైతుల్లో అధిక దిగుబడులు సాధించాలనే పోటీతత్వం పెరిగి విరివిగా పురుగు మందులను వినియోగించారు. దీంతో పాటు ఎకరానికి మినుము తీతకు రూ. 7 వేలు, పోగు చేసినందుకు రూ.2 వేలు, మిషన్‌ ద్వారా నూర్పిడి చేస్తే తూర్పూర బట్టడానికి 70 కిలోల బస్తాకు రూ.250, ఇతరత్రా ఖర్చుల రూపంలో నూర్పిడికే రూ.10 వేలకుపైగా ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఈ ఖర్చులన్నీ కలుపుకుంటే ఎకరానికి కనీసంగా రూ.30వేలకుపైగా పెట్టుబడి అవుతోంది. దిగుబడి మాత్రం ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లు మాత్రమే వస్తుండటంతో రైతులకు ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7,400

ప్రభుత్వం ఈ ఏడాది మినుము క్వింటా మద్దతు ధరను రూ.7,400 నిర్ణయించింది. మినుములో నాణ్యత తక్కువగా ఉంటే ధర తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు రైతుల నుంచి మినుమును కొనుగోలు చేసి తెనాలి, గుంటూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతేడాది క్వింటా మినుము రూ.7,200లకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. బండ పాలిష్‌ రకం మినుముకు మాత్రం వంద రూపాయలు అధికంగా ధరను పెంచి రూ.7,300లకు కొనుగోలు చేస్తున్నారు. అదికూడా మార్కెట్‌ ఒడిదుడుకులను బట్టి ప్రతిరోజూ మినుము ధరల్లో హెచ్చుతగ్గులను అంచనా వేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మినుము మద్దతు ధర క్వింటాకు బహిరంగ మార్కెట్‌లో రూ.8 వేల వరకు పలుకుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. మినుము తీతలో ఖర్చులు తగ్గించుకునేందుకు యంత్రాల ద్వారా కోత కోయిస్తే ఆ మినుము దుమ్ము, ధూళితో ఉండి పాలిష్‌ సక్రమంగా కనపడకపోవడంతో తక్కువ ధర చెల్లిస్తామని వ్యాపారులు అంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న ధాన్యం బస్తాకు రూ.200 వరకు తక్కువ ధరకే విక్రయించారు. ఈ లోటును మినుము దిగుబడి ద్వారా వచ్చే ఆదాయంతో భర్తీ అవుతుందని రైతులు ఆశించారు. మినుము దిగుబడులు తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మినుము కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 10 , 2025 | 12:06 AM