Police Confirm No Lathi Charge: దర్శన టోకెన్ల క్యూలో స్వల్ప తోపులాట!
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:46 AM
శ్రీవారి టైంస్లాట్ టోకెన్ల కోసం అలిపిరిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసంతో పాటు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో స్లాటెడ్ సర్వదర్శనం...
లాఠీతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది
భక్తులపై లాఠీచార్జి జరగలేదు.. వదంతులు నమ్మొద్దు
తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చర్యలు: ఎస్పీ
తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి టైంస్లాట్ టోకెన్ల కోసం అలిపిరిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసంతో పాటు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎ్‌సడీ) టోకెన్లను జారీ చేస్తారు. రద్దీని బట్టి 10 వేల నుంచి 20వేల టోకెన్లను మరుసటి రోజు దర్శనానికి జారీ చేస్తారు. క్రిస్మ్‌సతో పాటు ఏడాది చివరి వారం కావడంతో బుధవారం నుంచి తిరుమలలో రద్దీ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలోని మూడు కౌంటర్లలో ఉద యం 10.50 నుంచి ఒంటి గంటలోపు 10వేల టోకెన్లు జారీ చేసి కౌంటర్లు మూసివేశారు. అప్పటికే భూదేవి కాంప్లెక్స్‌లోని క్యూలైన్ వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో పక్కనే శ్రీవారిమెట్టు మార్గంలో కాలినకడన వచ్చే భక్తులకు దివ్యదర్శనం(డీడీ) టోకెన్ల జారీ చేస్తున్న క్రమంలో అందరూ ఆ క్యూలోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. కొంతమంది భక్తులు క్యూలైన్‌లోకి వెళుతూ కింద పడ్డారు. రద్దీని క్రమబద్దీకరిస్తున్న కొంతమంది భద్రతా సిబ్బంది క్యూలైన్‌లోకి ప్రవేశించి భక్తుల మధ్య తోపులాటను అరికట్టేందుకు ప్రయత్నించారు. ఓ విజిలెన్స్ హోంగార్డు లాఠీతో ఫెన్సింగ్‌ను కొట్టడం, భక్తులను తట్టి ముందుకు పంపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం: టీటీడీ
భక్తులపై భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేశారంటూ మీడియాలో ప్రచారం కావడంతో ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్లపై ఉన్న భక్తులకు నచ్చజెప్పి సర్వదర్శన క్యూలైన్ ద్వారా దర్శనం చేసుకోవచ్చని తిరుమలకు పంపారు. లాఠీచార్జి ప్రచారంపై టీటీడీ స్పందించింది. మరోవైపు లాఠీతో భక్తులను గట్టిగా తడుతూ ముందుకు పంపేందుకు ప్రయత్నించడంపై సిబ్బందిని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలిసింది.
లాఠీచార్జి జరగలేదు: ఎస్పీ
తిరుపతి భూదేవి కాంప్లెక్సులో భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారని సోషల్ మీడియాల్లో వైరల్ కావడం అవాస్తవమని ఎస్పీ సుబ్బరాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులను భయాందోళనకు గురిచేసే ఉద్దేశంతో కొందరు తప్పుడు వీడియోలు, తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధ్యతారాహిత్యమని తెలిపారు. ఎటువంటి తోపులాట కానీ, లాఠీచార్జి కానీ జరగలేదని స్పష్టం చేశారు. లాఠీచార్జి అంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.