Minor Brother: అక్క కళ్లల్లో ఆనందం కోసం బావ హత్య
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:41 AM
అక్క కళ్లల్లో ఆనందం కోసం ఓ మైనర్ బాలుడు సొంత బావతోపాటు అతని తల్లినీ కిరాతకంగా నరికి చంపేశాడు.
అడ్డొచ్చిన అతడి తల్లినీ నరికేసిన మైనర్
మరో ఇద్దరు మైనర్లతో కలిసి ఘాతుకం
ధూళిపాళ్లలో తల్లీ కొడుకుల దారుణ హత్య
సత్తెనపల్లి రూరల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అక్క కళ్లల్లో ఆనందం కోసం ఓ మైనర్ బాలుడు సొంత బావతోపాటు అతని తల్లినీ కిరాతకంగా నరికి చంపేశాడు. మరో ఇద్దరు మైనర్లతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన దొప్పలపూడి సాంబశివరావు (36)కు నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సాహితీతో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి సాహితీని సాంబశివరావు వేధిస్తూ ఉండేవాడు. దీంతో ఆరు నెలల క్రితం సాహితీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. పాలిటెక్నిక్ చదువుతున్న సాహితి సోదరుడు రోహిత్ చౌదరి.. దీన్ని మనసులో పెట్టుకుని సాంబశివరావుపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని హతమార్చాలని భావించాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన సాతులూరి రవికుమార్, షేక్ జావెద్ ఇస్లాంతో కలసి ఆదివారం సాంబశివరావు ఇంటికి వెళ్లారు. మంచంపై పడుకున్న సాంబశివరావును కత్తులతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అడ్డువచ్చిన సాంబశివరావు తల్లి కృష్ణకుమారి (55)ని కూడా నరికి అక్కడి నుంచి పారిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంబడించి నకరికల్లు మండలం చాగల్లు వద్ద పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాల పాలైన కృష్ణకుమారిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. నిందితుల్లో రోహిత్ చౌదరి పాలిటెక్నిక్, రవికుమార్, జావెద్ ఇస్లాంలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ముగ్గురూ మైనర్లే కావడం, తన అక్కను వేధించాడనే కక్ష పెంచుకుని అక్క కళ్లల్లో ఆనందం చూడడం కోసమే సాంబశివరావును హత్య చేసినట్టు రోహిత్ చౌదరి చెప్పడం సంచలనంగా మారింది.