Sri Satyasai District: బాలురే...కానీ, గంజాయికి బానిసలై...
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:49 AM
వారు మైనర్లు....బాల్య వయస్సులోనే గంజాయికి బానిసలయ్యారు. అంతే కాదు, తోటి బాలురను మద్యం సేవించాలని ఒత్తిడి చేశారు.
మద్యం తాగేందుకు రాలేదని ఇద్దరు బాలురపై దాడి
వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సత్యసాయి జిల్లాలో ఘటన
కదిరి అర్బన్, జూలై 30(ఆంధ్రజ్యోతి): వారు మైనర్లు....బాల్య వయస్సులోనే గంజాయికి బానిసలయ్యారు. అంతే కాదు, తోటి బాలురను మద్యం సేవించాలని ఒత్తిడి చేశారు. వారు వినలేదని గంజాయిమత్తులో క్రూరంగా దాడిచేశారు. దాడి దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఉంచారు. ఇవి వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి, దాడికి పాల్పడిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కాళసముద్రం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు ఇటీవల జరిగిన పీర్ల పండుగ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురను మద్యం తాగుదామని పిలిచారు. దానికి వారు నిరాకరించారు. దీంతో వారిపై ఆ ముగ్గురు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు గ్రామ శివారులో ఆదివారం గంజాయి సేవించారు. మత్తులో ఉండగా.. మద్యం సేవించేందుకు నిరాకరించిన ఇద్దరు బాలురు అటువైపు వెళుతూ కనిపించారు. ఇదే అదనుగా ఆ ముగ్గురు దాడికి దిగారు. ‘మద్యం తాగడానికి పిలిస్తే రారా..?’ అని కేకలు వేస్తూ చెప్పులు, చింతబర్రలతో చితకబాదారు. వదిలిపెట్టండి అని వేడుకున్నా కనికరించలేదు. ఓ వైపు దాడి చేస్తూ, మరోవైపు వీడియో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసిన పోలీసులు స్పందించి, బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. కాగా, తమ కుమారుడు గంజాయి, మత్తుకు అలవాటుపడ్డాడని, పలుమార్లు మందలించినా దారికి రాలేదని దాడికి పాల్పడిన ఓ బాలుడి తండ్రి మీడియా ఎదుట వాపోయారు.