Share News

TDP Ministers: అండగా ఉంటాం

ABN , Publish Date - Nov 03 , 2025 | 06:23 AM

: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన తొమ్మిది మంది కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది.

TDP Ministers: అండగా ఉంటాం

  • ‘కాశీబుగ్గ’ తొక్కిసలాట బాధితులకు మంత్రుల భరోసా

  • మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత.. ఒక్కొక్కరికి 15లక్షలు, క్షతగాత్రులకు 3లక్షలు

శ్రీకాకుళం/అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన తొమ్మిది మంది కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం బాధితుల ఇళ్లకు వెళ్లారు. మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.3లక్షలు చొప్పున చెక్కులను అందజేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

ప్రభుత్వం బాధ్యతగా స్పందించింది: ఆనం

కాశీబుగ్గలో పర్యటించిన మంత్రి ఆనం తొక్కిసలాట ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఇది దురదృష్టకర ఘటన. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. సొంత నిధులతో భక్తులు నిర్మించిన ఈ ఆలయం అత్యంత విశిష్టమైనది. తిరుమల తరహాలో ఇంత పెద్ద ఆలయం నిర్మించిన వ్యక్తి భక్తి ప్రశంసనీయం. స్థపతులు, అధికారుల సలహాలు తీసుకుని ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేది. ప్రైవేటు ఆలయం అయినా ప్రభుత్వం బాధ్యతగా స్పందించింది. 95ఏళ్ల హరి ముకుంద పండా ఇంత పెద్ద ఆలయం నిర్మించడం గొప్ప సేవ. కానీ ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేటు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుడతాం. భక్తుల భద్రత, ఏర్పాట్లు, ప్రవేశ మార్గాలు, అత్యవసర సేవలపై తక్షణ చర్యలు తీసుకుంటాం. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి ఉత్సవానికి ముందే భద్రతా సమీక్ష తప్పనిసరి’’ అని ఆనం స్పష్టం చేశారు.


ప్రభుత్వం ఆండగా ఉంటుంది: మంత్రులు

తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘‘ఈ దుర్ఘటనను రాజకీయాలకు అన్వయించడం సరికాదు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండటం బాధాకరం. కష్ట సమయంలో ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా నిలబడుతుంది’’ అని మంత్రులు పేర్కొన్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ఎంపీ సీఎం రమేశ్‌ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే కేంద్రం ప్రకటించిన పరిహారం కూడా పంపిణీ చేస్తారని తెలిపారు.

‘కూటమి’.. దేవుళ్లకూ నచ్చలేదు: బొత్స

తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గ ఘటనలతో కూటమి ప్రభుత్వం అంటే దేవుళ్లకూ నచ్చలేదని తెలుస్తోందని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కాశీబుగ్గలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ముమ్మాటికీ ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. తొక్కిసలాట మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామని.. అంతా బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు. పోలీసుల స్వాధీనంలో ఉన్న ఆలయ ప్రాంగణంలోకి వెళ్దామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పడంతో.. అలా వెళ్లకూడదని బొత్స సూచించారు.


తొక్కిసలాటపై పూర్తిస్థాయిలో దర్యాప్తు: డీఐజీ

కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి తెచ్చే దిశగా పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. కేసు దర్యాప్తుపై సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు, అసత్య సమాచారం వ్యాప్తి చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమన్నారు. ఇటువంటి పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు చేస్తున్నవారి వివరాలు సేకరించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు.

15 మంది క్షతగాత్రులు డిశ్చార్జి

తొక్కిసలాటలో గాయపడి చికిత్స అనంతరం కోలుకున్న వారిని ఇళ్లకు పంపుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆదివారం ఆయన సమీక్షించారు. పలాస కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్‌ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో శనివారం చేరిన వారికి వైద్యులు మెరుగైన వైద్యం అందించారని చెప్పారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న 15మందిని డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. పలాస సమాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది కూడా కోలుకున్నారని చెప్పారు. వీరిలో ముగ్గురు, నలుగురు మినహా మిగిలినవారు మూడు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. కాగా, పలాస సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నవారిలో ఒకరిని శస్త్రచికిత్స నిమిత్తం శ్రీకాకుళం జెమ్స్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.

Updated Date - Nov 03 , 2025 | 06:24 AM