పరకామణి దొంగ పశ్చాత్తాప పడతుంటే... వెనకేసుకొస్తున్న జగన్: మంత్రి మండిపల్లి
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:56 AM
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడుతున్నాడు.
గజదొంగ, మరో దొంగను సపోర్టు చేస్తున్నాడు: మంత్రి నిమ్మల
అమరావతి, పాలకొల్లు అర్బన్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడుతున్నాడు. కాని మాజీ సీఎం జగన్ మాత్రం సదరు దొంగను వెనకేసుకొస్తున్నాడు. అది చిన్న దొంగతనమేనంటూ వాదిస్తున్నాడు’ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గంజాయి సరఫరాదారుడైన కొండారెడ్డినీ జగన్ వెసుకేసుకు రావడం బాధాకరం. పరకామణి కేసులో ఎవర్ని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు? జగన్ గతంలో చేసిన పాపాలు ఆయన్ని, ఆయన పార్టీని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఆ పాపాల నుంచి బయట పడటానికి జగన్ ఆపసోపాలు పడుతున్నాడు. సీఐ సతీశ్‌కుమార్ ఎలా చనిపోయాడనే దానిపై విచారణ సాగుతోంది. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి’ అని తెలిపారు.
రాజకీయాల్లోనే ఉండ తగని వ్యక్తి జగన్
పరకామణి చోరీని చిన్న దొంగతనం అని జగన్ అనడం సిగ్గు చేటని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ‘గజదొంగ, ఇంకో దొంగను సపోర్టు చేసినట్టుగా ఉంది. జగన్ రాజకీయాల్లో ఉండతగని వ్యక్తి. దొంగకు అధికారం ఇస్తే ఏమౌతుంతో జగన్ పాలనే నిదర్శనం. జగన్‌కు ప్రజలకన్నా నేరగాళ్లు, బెట్టింగ్ దోపిడిదారులు, లిక్కర్ మాఫియాలపైనే ప్రేమ ఎక్కువ’ అని దుయ్యబట్టారు.