Village Casualties: ఒకే గ్రామంలో 23 మంది చనిపోతే ఏం చేస్తున్నారు
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:29 AM
ఒక గ్రామంలో 3నెలల వ్యవధిలో 23 మంది చనిపోతే క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య వ్యవస్థ ఏం చేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్య వ్యవస్థ ఏం చేస్తోంది?.. తురకపాలెం మరణాలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం
అమరావతి, గుంటూరు మెడికల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఒక గ్రామంలో 3నెలల వ్యవధిలో 23 మంది చనిపోతే క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య వ్యవస్థ ఏం చేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు రూరల్ మండలం, తురకపాలెంలో చోటుచేసుకున్న వరుస మరణాలపై గురువారం ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డీఎంఈ డాక్టర్ జి. రఘునందన్‌తో సమీక్ష జరిపారు. కేవలం వ్యవస్థాగత లోపాల కారణంగా ఇంత నష్టం జరిగిందని, స్థానిక ఏఎన్‌ఎంలు, మిగతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తురకపాలెం ఘటన నేపథ్యంలో సర్వైలెన్స్ (నిఘా) వ్యవస్థలో తగిన మార్పులు చేయాలన్నారు. కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ప్రత్తిపాడు శాసన సభ్యుడు బూర్ల రామాంజనేయులు, డీఎంహెచ్‌వో విజయలక్ష్మీతో కలసి గురువారం కమిషనర్ వీర పాండియన్ ఆ గ్రామంలో పర్యటించారు. ఉచిత వైద్యశిబిరాన్ని పరిశీలించి బాధితులకు అందిస్తున్న వైద్య ేసవలను, పరీక్షల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గవిడి రాయి ఒరగడం వల్లే అనర్థం!.. గ్రామస్థుల అనుమానం
గ్రామ తాగునీటి అవసరాల నిమిత్తం తమకు కేటాయించిన ట్యాంకు, సంపు కలుషితమయ్యాయని అధికారులకు స్థానికులు తెలిపారు. తమ గ్రామానికి వచ్చే రహదారుల్లో దుష్ట శక్తులు ప్రవేశించకుండా గవిడి రాళ్లను ఏర్పాటు చేసుకున్నామని, వీటిలో దక్షిణ దిశలో ఉన్న గవిడి రాయి పక్కకు ఒరిగి పోయిందని, అందుకే చ్రావులు కొనసాగుతున్నాయని చెప్పారు. దీంతో కలెక్టరు, అధికారులు ఆశ్చర్యపోయారు. గడివి రాయిని సరిగ్గా నిలబెడితే వరుస మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని గ్రామస్థులు చెప్పడంతో, సరిచేయాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఒరిగిపోయిన గవిడి రాయిని సరిచేసి యథాస్థానంలో ఉంచారు. కాగా, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం తురకపాలెంలో పర్యటించనున్నారు.