జగనే దేనిలోనైనా దూకాలి: మంత్రి సుభాష్
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:25 AM
రాయలసీమలో సూపర్‌సిక్స్ సభ సూపర్ హిట్ కావడంతో వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు.
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో సూపర్‌సిక్స్ సభ సూపర్ హిట్ కావడంతో వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మానసికంగా ఇబ్బంది పడుతుంటే జగనే దేంట్లోనైనా దూకాలి. వైసీపీ ఓ విషవృక్షం. గీత కులాల మధ్య చిచ్చుపెట్టడానికి 2023లో చెల్లుబోయిన వేణు మంత్రిగా ఉన్నప్పుడే గీత ఉపకులాలన్నింటినీ గౌడ్ కులం కిందకు తెస్తూ... వైసీపీ ప్రభుత్వం ఓ చీకటి జీవో తెచ్చింది. అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత రావడంతో దానిని దాచిపెట్టింది. ఇటీవల, కూటమి ప్రభుత్వమే ఆ జీవో ఇచ్చినట్టు, శెట్టిబలిజలను ఓసీలలో కలిపేస్తున్నట్టు తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. దీని గురించి తెలిసిన వెంటనే మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లాం. కేవలం వారం రోజుల్లో గీత ఉపకులాలైన శెట్టిబలిజ, గౌడ, శ్రీశయన, ఈడిగ, యాత కులాలకు సెపరేట్‌గా కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటూ జీవో వచ్చేలా చేశారు’ అని మంత్రి వివరించారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ, ‘గీత కులాలన్నీ ఒకటిగానే ఉంటాయి. కానీ ఎవరి ఉనికి వారికి అవసరం కాబట్టి, సెపరేట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను స్వాగతిస్తున్నాం’ అని అన్నారు.