Minister Satyakumar Yadav: సంపద సృష్టితోనే నిరుద్యోగ రహిత భారత్
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:27 AM
సంపద సృష్టితోనే నిరుద్యోగంలేని భారతావని సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు....
ఆత్మనిర్బర్ భారత్‌పై అవగాహన పెంచుకోవాలి
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ సూచన
అనంతపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): సంపద సృష్టితోనే నిరుద్యోగంలేని భారతావని సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సంపద సృష్టి జరిగితే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమౌతుందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అనంతపురం నగర శివారులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ‘ఆత్మనిర్భర్ భారత్’ అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆత్మనిర్బర్ భారత్‌కు స్వదేశీ, స్వభాష, స్వభూష మూడు స్తంభాలని స్పష్టంచేశారు. ఈ మూడు అంశాల గురించి విద్యార్థులకు ఆయన సుదీర్ఘంగా వివరించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, మాతృభాషపై గర్వం కలిగివుండటం, సంస్కృతి, వారసత్వాన్ని విలువైనదిగా భావించడమే ఆ మూడింటి లక్ష్యమని తెలిపారు. దేశం చారిత్రకంగా స్వయం సమృద్ధి కలిగి ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలో మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతోందని వెల్లడించారు. కొవిడ్ సమయంలో దేశం తన అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అప్పటినుంచి ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను కేవలం సిద్ధాంతంగా కాకుండా ఆచరణలో చూపారని కొనియాడారు. రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేసిందని మంత్రి తెలిపారు. విశాఖలో 15 బిలియన్ డాలర్లతో గూగుల్ సంస్థ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తోందని ఇటీవల చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇతర దేశాల ఉత్పత్తులపై ఆధారపడకుండా, స్వదేశి ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలతో స్వదేశి అవసరాలు తీర్చుకున్నప్పుడే ప్రగతి సాధ్యమౌతుందని తెలిపారు. దీనికితోడు ఎగుమతులను పెంచాల్సి ఉంటుందని తద్వారా సుస్థిర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు సాధ్యమౌతుందని చెప్పారు. అనంతరం వీసీ ప్రొఫెసర్ ఎస్‌ఏ కోరితో కలిసి వర్సిటీలోని అకడమిక్, అడ్మినిస్ర్టేషన్ విభాగాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు.