Minister TG Bharat : ఏపీలో కొరియా పెట్టుబడులు
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:37 AM
రాష్ట్రంలో ఎలకాట్ర్టనిక్స్, ఇతర రంగాల్లో ప్రభుత్వం కొరియా పెట్టుబడులను ఆహ్వానిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
ముసాయిదా ఒప్పందంపై సంతకాలు
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎలకాట్ర్టనిక్స్, ఇతర రంగాల్లో ప్రభుత్వం కొరియా పెట్టుబడులను ఆహ్వానిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో కొరియా ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పీపీపీ మోడల్‌లో స్కిల్ అకాడమీ ఏర్పాటు, కస్టమైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో కొరియన్ కంపెనీ సహకారం, కొరియన్ ఎంఎ్‌సఎంఈ పారిశ్రామిక సముదాయం అభివృద్ధి, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్, రొయ్యల ప్రాసెసింగ్, ప్యాకింగ్ తదితర 25 కీలక పరిశ్రమల్లో కొరియన్ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రం నుంచి కొరియాకు ప్రీమియం మామిడి ఎగుమతులను పునరుద్ధరించడం, హస్తకళలు, ఆయుర్వేదం, ప్రాసెస్ చేసిన ఆహారాల ప్రీమియం బ్రాండ్లను కొరియన్ మార్కెట్‌లో విస్తరించడం తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో తయారీ, శిక్షణ కేంద్రాలను నెలకొల్పేందుకు కొరియన్ సోలార్ కంపెనీలతో భాగస్వామ్యం, బ్యాటరీల తయారీ, సాంకేతికత బదిలీ కోసం కొరియా-భారత్‌ల మధ్య సహకారంపై కూడా చర్చించారు. ఈ చర్చల అనంతరం పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా బృందం రాష్ట్ర ప్రభుత్వంతో ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మంత్రి భరత్ వెల్లడించారు.