Share News

చేనేతలకు వేతనాల పెంపు: మంత్రి సవిత

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:45 AM

వేలాది మంది చేనేతలకు లబ్ధిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్‌ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని రాష్ట్ర బీసీ, చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖా మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.

చేనేతలకు వేతనాల పెంపు: మంత్రి సవిత

ఆప్కో, లేపాక్షి పనితీరు మెరుగుకు ఐఐఎంతో ఒప్పందం

అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): వేలాది మంది చేనేతలకు లబ్ధిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్‌ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని రాష్ట్ర బీసీ, చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖా మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మిక సహకార సంఘాల కింద పని చేసే నేత కార్మికులకు వేతనాలు, చార్జీల పెంపు వర్తిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చేనేతలకు 50 సంవత్సరాలకే పింఛను ఇస్తామన్న హామీని నిలపెట్టుకునేలా ప్రతి నెలా రూ.4 వేల చొప్పున 92,274 మంది నేతన్నలకు పింఛను అందజేస్తున్నామన్నారు. మర మగ్గాలకు 500 యూనిట్లు, చేతి మగ్గాలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని తెలిపారు. పలు కేటగిరీల్లో ఉత్తమ డిజైన్లను ఎంపిక చేసి విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆప్కో, లేపాక్షి పని తీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం(ఐఐఎం)తో ఒప్పందం చేసుకున్నామన్నారు. పీపీపీ విధానంలో ఇతర రాష్ట్రాల్లో లేపాక్షి షోరూమ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని సవిత తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 04:47 AM