Minister Savitha: రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఐకాన్
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:20 AM
సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ఓ ఐకాన్ అని మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో సోమవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
అభివృద్ధిలో దేశంలోనే ఏపీ ముందుంది
దోచుకోవడానికి, దాచుకోవడానికి కేరాఫ్ వైసీపీ: మంత్రి సవిత
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ట్రాక్టర్ ర్యాలీ
పెనుకొండ టౌన్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ఓ ఐకాన్ అని మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో సోమవారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ విజయోత్సవ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు, రైతులు వందలాది ట్రాక్టర్లతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘ఇదొక మంచి ప్రభుత్వం అనడానికి ఏడాదిపాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వం దోచుకోవడానికి, దాచుకోవడానికి అన్నట్లుగా ఐదేళ్ల పాలన కొనసాగించింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధిలో ఏపీ దేశంలోనే ముందు ఉంది. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలను మా నాయకుడు చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. గతంలో రైతులను ఇబ్బంది పెట్టారు. నాశిరకం ఎరువులు, విద్యుత్ సమస్యలతో రైతులు నట్టేట మునిగారు. కూటమి అధికారంలోకి రాగానే రైతుల పక్షాన నిలబడింది. వారికి అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చుతున్నాం. అన్నదాత సుఖీభవ నగదు 50 లక్షల మందికి జమ అయింది’ అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.